పుట:Prabodha Tarangalul.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186. ఆహారము వలన శరీరారోగ్యము, విషయాహారము వలన మనో ఆరోగ్యము ఉండును.

187. ఆహారము గుణములకు కారణముగాదు. గుణములే ఆహారమునకు కారణమని తెలుసుకో.

188. అజ్ఞానముచేత లోకాలెక్కడో ఉన్నాయనుకోకు. అన్ని లోకాలు నీ తలలోనే ఉన్నాయి.

189. పుట్టను చూచినంత మాత్రముననే పుట్టలోని పామును గుర్తించలేరు. అట్లే శరీరమును చూచినంత మాత్రముననే శరీరములోని జీవాత్మను గుర్తించలేరు.

190. ప్రమిదలో చమురు అయిపోతూనే దివ్వె ఆరిపోయినట్లు శరీరములో కర్మ అయిపోతూనే జీవాత్మ అంతరించిపోవును.

191. జీవునకు సంకల్ప వికల్పములు కలిగించి, వాటి యోచనల ప్రకారం పనులజేయించి, అప్పటికప్పుడు సుఖదుఃఖ భావాలకు గురిచేస్తున్నదే ప్రారబ్ధకర్మము.

192. నీవెంత తాపత్రయపడినా నీ కర్మమునకు మించిన ఫలము కలుగబోదు.

193. జీవుల కర్మ తీరాలంటే రెండే రెండు మార్గాలు కలవు. అనుభవించడమో లేక జ్ఞానాగ్నికి ఆహుతి చేయడమో.

194. నీకంటే వేరుగానున్న ప్రకృతియే నీ శరీరము.

195. నీకంటే వేరుగానున్న ప్రకృతిని (శరీరమును) నీవుగా భావిస్తున్నంతవరకు నీలోని అజ్ఞానం అంతరించదు.