పుట:Prabodha Tarangalul.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134. భార్యా మోహమనే సంకెళ్లు తగిలించి, పుత్రవ్యామోహమను చీలలుబిగించి, ప్రకృతియనే చెరసాలలో జీవున్ని బంధించి కర్మయను శిక్షను అనుభవింపజేస్తున్నది మాయ.

135. మనస్సు ఎక్కడుందో తెలుసా? అది నీవలె శరీరములో ఒక చోట లేదు. మెలుకువలో శరీరమంతా వ్యాపించియున్నది.

136. కర్మల ఆధారముగ చేయించేది ఆత్మ, చేసేది కాయము, అనుభవించేది జీవుడు.

137. ప్రపంచములోని ప్రతిమనిషి సుఖం కలుగుతుందను ఆశతోనే కష్టాల పూజలు చేస్తున్నాడు.

138. మాయ అనే అద్దంలో ప్రతిబింభిస్తున్న జీవాత్మల యొక్క చావు పుట్టుకల స్వరూపమే ఈ జగత్తు.

139. బలమైన ప్రకృతి శక్తులను తన వశం చేసుకొని పరవశించాలని పరవళ్లు ద్రొక్కుతున్న మానవుడు చివరకు ప్రకృతి శక్తులచేతనే భంగపడక తప్పదు.

140. దేని ఆధారముతో అన్ని నావనుకొంటున్నావో ఆ జ్ఞప్తిని అరక్షణములో అంతము చేయగల అజ్ఞాతశక్తి ఒకటుంది. అదే నీ మృత్యువు.

141. నేను అనుకొంటే నీవు నీవుగానే ఉంటావు. నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అంటాడు పరమాత్మ.

142. అజ్ఞానులు సంసారం కోసమై కర్మ చేస్తారు. జ్ఞానులు కర్మకోసమై సంసారము చేస్తారు.