పుట:Prabodha Tarangalul.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107. అన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ఆ కాలం వచ్చేవరకు జీవులు వేచి ఉండాల్సిందే.

108. స్త్రీల యవ్వన సౌందర్యానికి చిత్తచాంచల్యము బొందెడి జీవులు ఆ శరీరాలలోని చైతన్యశక్తియే ఆ సౌందర్యమని అర్థం చేసుకొనలేకున్నారు.

109. అనిత్యమైన శరీరాలను ప్రేమించి ఆనందిస్తున్న జీవులు అవి నశించినప్పుడు ఆవేదన పొందుతారు. ఆ శరీరాలకు ఆధారమైన ఆత్మ నిత్యమైనది. దాన్ని గుర్తించితే అసలు దుఃఖమే లేదుగదా!

110. సూర్యున్ని మేఘము గప్పినట్లు జ్ఞానాన్ని కామము కప్పియున్నది. వాయు తరంగాల ధాటికి మేఘము చెదిరిపోయినప్పుడు సూర్య ప్రకాశము గోచరించినట్లు, ప్రబోధ తరంగాల తాకిడికి కామము చెదిరిపోయినప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుంది.

111. నీలో జ్ఞానము నీకు తెలిపేనిమిత్తమే గురువు నిన్ను పరీక్షిస్తాడు.

112. కాలము తీరినప్పుడు కాయము. కర్మదీరినప్పుడు జీవము కడతేరుచుండును.

113. పాదరక్షలు ధరించినవారు కంటకావృతమైన మార్గములో నిర్భయంగా ఎలా నడువగలరో, తద్విధముగా జ్ఞానరక్షలు ధరించినవారు సంకటావృతమైన సంసారమార్గమున ధైర్యంగా సాగిపోగలరు.

114. జ్ఞానమను కవచాన్ని ధరించిన జీవునకు అరిషడ్‌ వర్గములు వేయు విషయములనే విషబాణములు తగిలినప్పటికి అవి ఏమి చేయజాలవు.