పుట:Prabodha Tarangalul.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ క్షణములోనే ప్రయత్నించు. ఎందుకంటే మనస్సు చంచలమైనది. జీవితం అస్థిరమైనది.

88. సంకల్పాలులేని జ్ఞప్తియే నీకు దేవునికి మధ్యలోగల ఆత్మను గ్రహిస్తుంది.

89. నిన్ను నీవు తెలుసుకోగలిగినంత మాత్రమున నీ బయటనున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు. కర్మ అయిపోయి నీ శరీరము వదలిన తర్వాతే పరబ్రహ్మ తెలియును.

90. విషయములనే విష వృక్షాలతో నిండిన అజ్ఞానారణ్యములో అలమటిస్తున్న జీవా! అందుకో ఆధ్యాత్మికాయుధాన్ని అడుగంటా కూల్చివేయి ఆ అరణ్యాన్ని, అప్పుడే అఖండ పరబ్రహ్మమనే బయలులో సేద తీర్చుకొంటావు.

91. నీచవాంఛలకు నీమదిలో తావీయకు అవి నిన్ను ఆత్మజ్ఞానానికి అతిదూరం చేస్తాయి.

92. సౌఖ్యాలు కల్గించే కర్మలు తన ప్రమేయమని, బాధలు కలిగించే కర్మలు దైవప్రమేయమని భావించుట అజ్ఞానమగును.

93. నీ దేహములో సర్వాంగాలు నావి అంటున్నావు నావి అంటున్న నీవెవ్వరో తెలుసుకోలేకున్నావు.

94. కలిమి కల్గినపుడు కానరాడు దేవుడు, లేమి కలిగినపుడు మాత్రమే జ్ఞాపకానికి వస్తాడు.

95. జగమంతా నిండిన జగన్నాథుడే భగమునుండి ఉద్భవించి భగవంతుడైనాడు. అతడే రాయబారి, అవధూత.