పుట:Prabodha Tarangalul.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

59. అందాలన్ని ప్రకృతివే, కానీ పరమాత్మ లేనిదే అవి ప్రకాశింపవు.

60. జ్ఞానదృష్టిచే ప్రకృతిని పరిశోధించు! ప్రకృతిలోనే పరమాత్మ తత్త్వాన్ని పరిగ్రహించగలవు.

61. జన్మరహితమే అద్వైతసిద్ధి. ఆలోచన సహితమే మాయసిద్ది.

62. ఆసనాదుల సాధనము వలన అంగారోగ్యమే కల్గును. ఆత్మైక్యత కల్గదు. అవి ఆరోగ్య అసనాలేకానీ యోగాసనాలు కావు.

63. వికలాంగ జీవుల చూచి విచారిస్తున్నావా? వెనుక జన్మలలో వారెంత ఘోరపాపముచేసారో! ఇప్పుడీ విధంగా శిక్షను అనుభవిస్తున్నారు.

64. వృద్ధాప్యములో దైవాన్ని తెలుసుకొందామని ఊహిస్తున్నావా! చింతల చిక్కులలో చిక్కి చితిగిపోయిన మనస్సునకు ఆత్మావగాహన అతుకదు.

65. మోక్షమను గృహములోనికి ప్రవేశించాలంటే మూడు మెటికలు ఎక్కవలసి వస్తుంది. అవియే 1) భక్తి 2) జ్ఞానము 3) యోగము లేక ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలను దాటవలసి వస్తుంది.

66. భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన యోగము, యోగము వలన తత్త్వము, తత్త్వము వలన ముక్తి సిద్ధిస్తుంది.

67. దైవజ్ఞానమంటే ఏమిటోగాదు. ఆత్మవిషయములను (ధర్మములు) తెలుసుకొనడమే.

68. బాహ్యంగా అగ్నితో చేయు యజ్ఞము కట్టెలను, అంతరంగములో జ్ఞానాగ్నితో చేయు యజ్ఞము కర్మలను కాల్చును.