పుట:Prabhutvamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ప్రభుత్వము

మునకుజేరినది. కాని యొక్కమాట మాత్రము ఇక్కడ వ్రాయవలసి యున్నది. మనగ్రామములలో అన్నివిధములగు ఏర్పాటులును గ్రామస్థులచేతులలోనే యుండి, వారే కుటుంబములోని ఇంటిపెద్దవలె గ్రామపుపెద్దలను నియమించుకొని పనులు నెరవేర్చుకొనుచుండిరనుట నిజము.

గ్రామముపై బడుటకు 'బందిపోటు' వచ్చుచున్నదని వినినయెడల గ్రామస్థులలో పటుత్వముగల వారందరును, ఆయుధపాణులై బయలుదేరి గ్రామమును కాపాడుకొనుచుండిరి. గ్రామములో విద్యాలయము జరుగవలయుననిన గ్రామస్థు లందరును బడిపంతులకు సంవత్సర గ్రాసము కల్పించి 'అతనిని పోషించుచుండిరి. గ్రామములో బాటలు వేసికొనవలసియుండిన తలకొకబండిరాళ్లు తోలి పని జరుపుకొనుచుండిరి. గ్రామమునకు కావలసిన భోజనాదివసతులనిర్వహణమునకు, గ్రామమునకు సంబంధించిన వ్యవసాయమునకు, నేతపనికి, కమ్మరమునకు, కుమ్మరమునకు, వడ్రంగమునకు ఇత్యాదుల కన్నింటికిని ఏర్పాటులుండెను. గ్రామములో ఏదైనను కలరా

మున్నగువ్యాధులు కాన్పించినచో ఆయా గ్రామమువారలనమ్మకముల, విశ్వాసముల ననుసరించి ప్రతీకారములు చేయుటయు గ్రామవాసులందరి సమష్టి ప్రయత్నము మీదనే జరుగుచుండినది.[1]

  1. ఇట్టిపనిలో విశేషభాగము జరుగుటకు వీలుచేయవలయు నను నుద్దేశముతో నే ఇటీవల మనకోస్తాలో ‘పంచాయతు'ల నిర్మాణమునకును, నిర్వహణమునకును చట్టమేర్పరచి ఇప్పు డాచట్టమును లోకలుబోర్డులశాసనముతో నైక్యపరచి యున్నారు. కొన్ని కొన్ని జిల్లాలలో ముఖ్యముగా గుంటూరు, గోదావరులు, సేలము, ఉత్తరార్కాటులలో నూర్లకొలది పంచాయతులు చక్కగ పనిచేయుచున్నవి. కాంగ్రెసుప్రభుత్వము లేర్పడినపిదప మరల గ్రామవ్యవహారము లన్నిటిని పంచాయతుల పరము చేయవలెనని వారు ప్రయత్నించుచున్నారు.