పుట:Prabhutvamu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ప్రభుత్వము

చున్నారు. ఇతరరాష్ట్రములతోటి సంబంధబాంధవ్యములను జరుపుటయు అధికారవర్గమునకు చెందిన స్వాతంత్ర్యమేయగును. సైనికవర్గమును, నావికవర్గమును, ఆకాశ విమానదళమును ఆయత్తపరచి వినియోగించుట, దేశములోని పోలీసు కార్యములను నిర్వహించుట, రైళ్లురోడ్డులు ఇత్యాది సౌకర్యములను ప్రజలకు చేసియిచ్చుట, యజమానులకును పనివారలకును కలుగునట్టి సంబంధములను సమపరచినడుపుట ఇత్యాది కార్యములన్నియును అధికార వర్గమువారు శాసనకర్తల ప్రతినిధులుగా చేయునట్టి కార్యములై యున్నవి. మన దేశమునకు ఈవర్ణన పూర్తిగా నన్వయించునని యనుకొనరాదు. స్వయంపరిపాలన సంపూర్ణముగా గల రాజ్యములకే యిది యన్వయమగును. శాసనకర్తలు పరిమితాధికారము కలవారుగా నున్నంతకాలము మనమీవర్ణనను ఆదర్శప్రాయముగా మాత్ర మంగీకరింపవలసి యుందుము. శాసనకర్తలు సంపూర్ణాధికారము కలవారయియుండు స్వపరిపాలితరాష్ట్రములలో గూడ అధికారవర్గమునకు శాసనకర్తల యధికారమునకు మించిన యధికారము కొన్ని కలవు.

అధికారవర్గశిఖరమున నేకవ్యక్తి యుండుట కార్యసాధనకు ముఖ్యాధారమంటిమి. ఈఏకవ్యక్తి యాజమాన్యము రమారమిగా నేటి నాగరకరాష్ట్రము లన్నిటను కాననగును. అయిన కొన్ని చోట్ల నీఏకవ్యక్తి పేరునకు మాత్రము అధికారవర్గశిఖరము నధిష్ఠించుటయు, మరికొన్నిచోట్ల నిజముగా సర్వాధికార ధూర్వహుడగుటయు చూడవచ్చును. అమెరికాసంయుక్తరాష్ట్రాధీశ్వరుడగు