పుట:Prabhutvamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ప్రభుత్వము

కరింపబడినది. అచ్చటిప్రాంతములనుండి — వీనిని పట్టణములనియే చెప్పవచ్చును. ఒక్కొక్కింటికి ఇరువురు సభ్యులు శిష్టసభకు రానర్హులు. సగముప్రాంత మొక్కరిని, మరి సగముప్రాంతము మరియొక్కరిని నియమించుకొనుచున్నది. పరాసుభూమిలోను 'శిష్ట' సభకు సభ్యుల నెన్నుకొను నధికారము డిపార్టుమెంటు లనబడు రాష్ట్రములబోలు మండలముల కే కలదు. కాని యొక్కొక మండలమునకును సమానమైన సంఖ్య కానరాదు. ఇద్దరు మొదలు పదుగురవరకును ప్రతినిధుల నెన్నుకొను స్వాతంత్ర్యము అచ్చటి మండలముల కేర్పడియున్నది.

శిష్టసభ సభ్యత్వమునకును ప్రజాప్రతినిధిసభ సభ్యత్వమునకును తారతమ్యము పాటించుటకు మరియొక యుపాయమును ఆలోచింపబడియున్నది. ప్రజాప్రతినిధిసభకు సభ్యత్వమున కర్హతలు వేరుగను, శిష్టసభ సభ్యత్వమున కర్హతలు వేరుగను నియమించుటకలదు. ముఖ్యముగా వయస్సు విషయమున నీవిభేద మనేకరాజ్యములలో కానవచ్చుచున్నది. ప్రజా ప్రతినిధిసభ్యత్వమునకు పౌరుడుగా నుండిన చాలుననుట సామాన్యసిద్ధాంతము. పౌరత్వమున కర్హత యుక్తవయస్సు వచ్చినతోడనే కలుగుచున్నది. అనగా 21-23 సంవత్సరముల వయస్సువాడైనచో పౌరుడు ప్రజాప్రతినిధి సభలో నాసీనుడగుటకు తగినవా డగుచున్నాడు. కాని శిష్టసభయందు ఆసీనుడగుటకో పరాసు భూమి, ఇటలీ, బెల్జియములలో 40 ఏండ్లవయస్సు కలవాడు కావలెను. అమెరికాసంయుక్త రాష్ట్రములలోను, తదనుయాయులగు నితరరాజ్యములలోను అధమపక్షము