శాసననిర్మాణస్వరూపము
25
ప్రజలచే నేరుగా నెన్నుకొనబడు . ప్రతినిధుల సభ యొక్కటే యుండునెడల ఆసభ ప్రజల తాత్కాలికావేశమును శాసనరూపముగా స్థిరపరుపవలసి వచ్చును. తొందరలో సాగిపోయిన శాసనము త్రిప్పవలయుననిన మరల వృథాప్రయాస కలుగును. తాత్కాలికావేశము నశించినతోడనే ప్రజలు నూతనదృష్టిపథమును అవలంబింపవచ్చును. అప్పుడు కార్యము లన్నియు తారుమారగును. అట్టిరసాభాసమును ఆపుదలచేయుటకు శిష్టసభలు మిక్కిలి సహకారు లగుచున్నవి.
(2) ప్రజాప్రతినిధుల సభలలో ఎక్కువ సంఖ్యాకుల సమ్మతుల ననుసరించి వ్యవహారములు తీర్మానములగుచున్నవి. తక్కువసంఖ్య బ్రతినిధుల నెన్నుకొను బ్రజలు ఈ ఎక్కువ సంఖ్యాకుల నిర్ణయములకు తలయొగ్గ వలసి యుండును. శిష్టసభయను మరియొకసభ లేక యుండిన యెడల తక్కువ సంఖ్యాకులగు ప్రజల ప్రతినిధులు నోరెత్తకుండ వారిని నణచివేయుట గూడ నెక్కువ సంఖ్యాకుల ప్రతినిధులకు సుకరంబగును. కాబట్టి ఎక్కువసంఖ్యాకులగు ప్రజల ప్రతినిధుల యభిప్రాయ మంగీకృతము కావలయునను సిద్ధాంతమున్నంతకాలము రెండవసభయైన శిష్టసభ లేనిచో తక్కువసంఖ్యాకుల గతి దుర్భరము కావచ్చును. వారి స్వాతంత్ర్యములు వెలివడకుండ కూడ నపహృతములు కావచ్చును. అందుచేత శిష్టసభలు ఎక్కువసంఖ్యాకుల నిరంకుశత్వమును నిరోధించుటకు సహకారు లగుచున్నవని నాగరకరాష్ట్రము లీసభలను నిలువబెట్టుకొని యున్నవి.