పుట:Prabhutvamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ప్రభుత్వము

మాత్రమయియుండిరి. ప్రజావబోధముకలిగిన తరువాతగూడ రాజులకు గావలసినవారును, ప్రభువులకు గావలసినవారును శిష్టసభలో సభ్యులుగా నుండుచు వచ్చినారు. అయిన వీరిపలుకుబడి క్రమక్రమముగా నశించిపోయినది. కొంతపలుకుబడి నిలుపుకొనియుండిన ఇంగ్లీషు ప్రభువుల సభయుగూడ 1911-వ సంవత్సరపు పార్లమెంటు ఆక్టు కారణముగా నామమాత్రావశిష్ట మయినది. అయినను ఈసభను బొత్తుగా రద్దుసేయునుద్యోగమునకు ఇంగ్లీషుప్రజలు కడంగలేదు. ఇతరవిధముల నిర్మితములయిన శిష్ట సభలును నేటిదినము శాసననిర్మాణాధికారమున ప్రత్యేకాంగముగా నంగీకృతములయి యున్నవి. ఇట్లంగీకృత మగుటకు కారణము లారయవలయును. అనేక దేశములలో నీశిష్టసభ పరంపరాగతమయివచ్చియున్నందున దీనిని ప్రజలు తప్పించుకొనుటకు రాలేదు. ఇది యొక కారణమే. కాని ప్రజలందరు అభిప్రాయపడినచో ఈ కారణమునకు బలముండదు. వారలు ఒక్కపూటన ఈ శిష్టసభలను తుడిచి పారవేయవచ్చును. యుద్ధానంతరము అదివరలో శిష్టసభలు ప్రబలియున్న దేశములలోనుగూడ పరంపరాగత శిష్టసభలు ఈరీతిగా నశింపుపొంది క్రొత్తస్వరూపములు దాల్చినవి. కాబట్టి శిష్టసభలు నిలిచి యుండుటకు మరి వేరుకారణము లుండి తీరవలయును.

(1) ప్రజాసమూహ మెల్లప్పుడును శాంతముగా నాలోచించు నను కొనరాదు. ఒక్కొక సందర్భమునందు ప్రజలలో ఏదైనను పొరబాటైన అభిప్రాయము వ్యాపించి కలవరము కలుగవచ్చును. ఆసమయమునందు