Jump to content

పుట:Prabhutvamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడు శక్తులు

17

గుదురు. అప్పుడు జరిగిన ఘోరస్థితులును పదేపదే వర్ణితములయియేయున్నవి. గౌరవవంతులగు మానవులను పొట్టమీద ప్రాకించు నంతటి యధికారముకూడ సైనిక ప్రభుత్వాధికారులకు నుండినది యనినచో శాసననిర్మాణ, వివరణ, నిర్వహణాధికారములు మూడును పరిపూర్ణముగ నేక వ్యక్తియందు ఇమిడినచో కలుగు దుర్భరస్థితి యర్థము కాకపోదు.

ఈశక్తుల విభాగము మనపూర్వచరిత్రమున ఎంతవరకు జరిగినది? నే డెంతవరకు కలదు? ముం దెంతవరకు నుండగలదు? అనుప్రశ్నలకు ప్రత్యుత్తరము వ్రాయగడంగినచో నదియే మహాగ్రంథము కావచ్చును. అయిన క్లుప్తముగా సంగతినిగమనించి ముందు విషయముసకు తరలవలసి యున్నాము. సామాన్యముగా పూర్వము మనదేశములో రాజులు నిరంకుశులుగా నుండిరనియు అప్పటికాలమున శాసననిర్మాణము, శాసనవివరణము, శాసననిర్వహణమను విభాగ ముండనే లేదనియు వ్యవహరించుట గలదు. ఇదివరలోనే యీగ్రంథములోనే తెల్లము చేసినవిధమున గ్రామగ్రామమునకు స్వతంత్రజీవనమేర్పడి యుండిన దే కాక మనరాజులు నిరంకుశులుగాక, నేటి ఆంగ్ల సార్వభౌముని పగిదిని మితాధికారధూర్వహులుగానుండి రనుట, రానురాను చరిత్రకారులు గ్రహించుచున్నారు. ఋషులు శాసనములుచేయ, ప్రజారంజకముగ మంత్రులు వానికర్థముజెప్ప, రాజులు వానిని అమలులో పెట్టుచుండినారు. రాజు శాసననిర్వహణాధికారి తక్క వేరుకాదు. ఇది రామాయణకాలమునకు మున్నే మన భారతభూమి