పుట:Prabhutvamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

మూడు శక్తులు

ఈమూడు శక్తులును ఒక్కటే స్థానమునందు ఏకమైయుండునెడల కలుగునష్టము మిక్కిలి యెక్కువయని యెరింగి లోకము బహుకాలముగా వీనిని వేరుపరచియుంచుటకు సర్వ ప్రయత్నములును చేసినది. అయిన నెచ్చటను సంపూర్ణముగా వేరుపరచుటకు రాలేదనుటయు నిక్కువమే. మొదటినుండియు లోకములో నిరంకుశ ప్రభువులు దేశములను వశముచేసికొని సర్వాధికారములును తమచేతులలో నుంచుకొని పరిపాలించుచు తమ దివ్య చిత్తమునకు వచ్చినదియే శాసనముగా ప్రవర్తించుచు వచ్చినందున పై ప్రయత్నము జరుగవలసివచ్చినది.

చిన్న ఉదాహరణమును గొందము. సైనికాధికారమునకుపోలిన మరియొక నిరంకుశప్రభుత్వపద్ధతి లేనేలేదు. సైనికాధికారప్రభుత్వ మున్నంతకాలము అధికారమున నుండునట్టి సైనికాధికారి నోట నేమాట యుచ్చరించిన నది శాసనము. అత డేయర్థము చెప్పిన నదియే శాసనమునకు నర్థము. అత డేరీతిని శాసనమును అమలులో పెట్టిన నదియే శాసననిర్వహణము. కాబట్టి సైనికాధికార ప్రభుత్వమున నధ్యక్షుడుగానుండు నతడు ప్రభుత్వాంగములును మూడింటిని పూర్తిగా వశముచేసికొని ఇచ్చకు వచ్చినమేరకు చరించుచుండును. కొంతకాలముక్రిందట పంజాబులోను, ఇతర ప్రాంతములలోను స్వల్ప కాలము సైనికప్రభుత్వము వెలసినదనుమాట మాచదువరు లెరుం