Jump to content

పుట:Prabhutvamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ప్రభుత్వము

నేమియు సహాయములేనివాడనై యున్నాడనే, నన్నేల ఇట్లు పీడించెదవు' అను నర్థమిచ్చును. ఇంతేకాదు. పదములపొందికకూడ బుద్ధివికాసము కలవారలకు వేర్వేరు అర్థములను స్ఫురింప జేయుచుండును. స్వపక్షమును సమర్థించుకొనుట మానవునకు నైజగుణము. అందుచేత శాసనము చేయబడిన పిదప దానిలోని పదజాలమును తనకు అనుకూలపడునట్లు వినియోగింప జూచుకొనుట మానవునకు లక్షణమైనది. కాబట్టి శాసనము పుట్టినతోడనే దానికి నర్థముచెప్పునట్టి యధికారియు నేర్పడవలసి వచ్చినాడు. ఒక్క చిన్న దృష్టాంతము. మనదేశపు శిక్షాస్మృతిలో 'దొంగతనము' అనునది నిర్వచింపబడినది. పరుని వస్తువును అతనియనుమతి లేక స్వీకరించుట దొంగతనము అనియున్నది. ఒక్క ఇంటిలో ఇద్ద రన్నదము లున్నారు. అచ్చట ఒక్కవస్తువుకలదు. అందుకు సంబంధించి ఎవ్వరు ఎప్పుడు పరుడగును? ఈ వివరణ శాసనములలో లేదు. ఇదేవిధముగా 'అనుమతి’యను సంగతియు సందిగ్ధములకు కారణము. తల యొకప్రక్కకు సూచిన సమ్మతియగును. రెండవప్రక్కకు త్రిప్పిన సమ్మతి లేకపోవచ్చును. ఈవివరణమును శాసనములోలేదు. ఈవివరణముల నిర్ణయము చేయుటకు అధికారి అవసరముగదా! ఆయధికారమే శాసనవివరణాధి కారము, న్యాయవిమర్శనాధికారము అనుపేళ్ల బరగుచున్నది. అప్పటికప్పుడు సందర్భముల నన్నిటిని విని శాసనముల కర్థము నిర్ణయించి తీర్పుచెప్పుట కేర్పడినవారినే మనము మేజస్ట్రీటులని, మునసబులని, జడ్జీలని, పంచాయతులని, కోర్టులని వ్యవహరించుచున్నాము.