పుట:Prabhutvamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ప్రభుత్వము

వీనివలన సర్వసంఘమునకును విపత్తుగలుగుటకు అవకాశమున్నది. కాబట్టి వివాదములు ఇట్టివిపత్తునకు నాకరమైనవి, యిట్టి విపత్తునకు ఆకరముకానివి యని రెండుతెగలుగా నేర్పడియున్నవి. ఈరెండుతెగల వివాదములను తీర్చు కోర్టులకు క్రిమినలుకోర్టులు, సివిలుకోర్టులు అనువ్యవహారము కలిగినది.

గోపురాకారము

ఈరెండుతెగల కోర్టులును సామాన్యముగా గోపురాకారముగా క్రిందినుండిపైకి అంతస్థులు అంతస్థులుగా నియమితములయియున్నవి. మరీ చిన్న వ్యవహారములను సివిలుక్రిమినలు రెంటిని విచారించు గ్రామన్యాయస్థానములు ఈరెండుగోపురములకు బునాది. అందుపైన నొక్కగోపురమున మునసబుకోర్టులు, సబుకోర్టులు, జిల్లాకోర్టులు, హైకోర్టు, ఫెడరలుకోర్టు, ప్రీవికౌన్సిలు ఈరీతిని నంతస్తులు కలవు. అదేవిధముగా క్రిమినలు గోపురమున మేస్ట్రీటుకోర్టులు, అందులో తరగతులవారి - జిల్లాకలెక్టరు, జిల్లాజడ్డీ, హైకోర్టుమున్నగు నంతస్థులున్నవి. ఇతర దేశములందును నేవంవిధమగు నంతస్థులుకాననగును. క్రిందియంతస్థున ప్రారంభించి ఆయావ్యాయోగస్వభావము ననుసరించి శిఖరాగ్రమువరకును వ్యవహారములు నడుపుకొనవచ్చును. కాని వ్యవహారములు విశేషభాగము పంచాయతులయెదుట తీరిపోవునట్లేర్పరచుటే యుత్తమము. ఇతర దేశములలో పంచాయతులకు సామ్యముగల పద్ధతులుగలవు. వానిని జ్యూరీలనియు, మరియితర పేళ్ళతోను వ్యవహరింతురు.