పుట:Prabhutvamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ప్రభుత్వము

ఇత్యాదులను నియమించి, దేశములో నివసించునట్టి ప్రజలలో కలుగు పరస్పరమగు వివాదములను దీర్చుచు, పోట్లాటలను ఆపుచు శాంతి నెలకొల్పి దేశజీవనము సావధానముగా, ధర్మబద్ధముగా నడుచునట్లు చేయుట రెండవపని.

ఈరెండుకర్మలే 'ప్రభుత్వము' అను అధికారము నొసట నీశ్వరుడు వ్రాసినాడను సిద్ధాంతము పాశ్చాత్య భూములలో బహుకాల మంగీకృతమై యుండినది. రాజులు నిరంకుశులుగా నున్నన్నిదినములు, అధికారవర్గములు నిరంకుశములుగా నున్నన్నిదినములు, ప్రజలకు నోరు లేనంతకాలము ఈసిద్ధాంతము అవసరమైయుండినది. దేశములోని వృత్తులను అభివృద్ధి చేయునట్టి పనియు, గనులను త్రవ్వి లాభము సంపాదించుపనియు, ఇటువంటి పనులు పెట్టినయెడల రాజులును, నిరంకుశులును తమబలమును హెచ్చించుకొనుటకే ఈయధికారములను వినియోగించు కొందురు. విద్యావ్యాపనాధికారము వారికి నుండెనేని సామాన్యప్రజ తమకు నెట్లంకితులగుదురాయని ఆలోచించి తదనుకూలమగు విధానమునే నెలకొల్పుట వారికి స్వాభావికమగును. అధికారములు ఒనగూడినట్లెల్లను నిరంకుశప్రభువులును, అధికారులును ఈవిధముగా తమ తమబలమును పెంచుకొన జూచుట తప్పని ఫలము. కాబట్టి నిరంకుశపరిపాలనపద్ధతులు ప్రబలినంత కాలమును పాశ్చాత్యభూములలో ప్రజలు ప్రభుత్వముననుండిన రాజులకును అధికారవర్గములకును ఇట్టి అధికాధికారములను ఇచ్చుటకు అంగీకరించుచుండలేదు. ఇట్టి అధికారములు