పుట:Prabandha-Ratnaavali.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 ప్రబంధరత్నావళి

చ. పలుచని చంద్రికారసము ప్రన్నని నున్ననితేట క్రొమ్మెఱుం
గుల తుదల న్విదిర్చు నెలకొమ్ములకాంతి పసిండినిగ్గుతోఁ
గలిపి యలంతి వన్నె యిడి కాయజునిల్పిన రత్నపుత్రిక
న్నలువ సజీవిఁ జేసెనొకొ నాఁ దగు నాతివిభాతి చూడ్కికిన్. (ఆం) 45

సీ. పాంథులహృదయముల్ పల్లటంబులు సేయ దర్పకు పనిచిన దం డనంగ
విరహిమృగంబుల సురిఁగింపఁ దివిరెడు కాయసంభవుని మొక్కల మనంగఁ
గడునల్గి జైత్రునాగారంబు ముద్రింప మనసిజు పనిచిన యనుఁగు లనఁగ
సహచరుం డగు గంధవహుఁ గానఁగా మీన కేతను పంచిన దూత లనఁగ
తే. నభినవాకారసౌందర్యసుభగలీల
లతిశయంబుగ మెలఁగుచు నసమబాణు
పుష్పలావికాజనములపోలె నెఱసి
కోమలాంగులు పువ్వులు గోసి రెలమి. (ఆం) 46

ఉ. పూవులప్రోవులై చిలుకబోదలు కోయిలపిండు మందలై
తావులక్రోవులై యలివితానము గానము తానకంబునై
కావను బండఁజాలుటఁ ద్రికాలముఁ గల్గ వరంబుఁ గన్నయ
ట్లై వనరాజి పొల్పగుఁ బురాంతికభూముల నెల్లఁ జూడఁగన్. (ఆం) 47

చ. పొడవుగ నెల్లయంగళులఁ బ్రోవులు వోసిన నూత్నరత్నముల్
కడఁక ననేకవేషములు గైకొని వచ్చిన యర్థికోటికిన్
బిడికెఁడులాదిగాఁగ బలి వెట్టుదు రప్పురి వైశ్యభామిను
ల్కడపక హస్తకంకణఝళధ్వను లొప్పఁగ నెల్లయప్పుడున్. (ఆం) 48

సీ. ప్రత్యగ్రరచనాతి భాసురప్రాసాద నిర్జిత గోత్రావనీధరంబు
ప్రాకారశిఖరాగ్రబంధురమణిగణ ద్విగుణితతారకావిభ్రమంబు
పరిఖాజలాంతరప్రతిబింబితద్రుమ స్మారితపాతాళభూరుహంబు
వనపుష్పసౌరభావర్జితమధుపశూ న్యీకృతాశావారణేంద్రగండ
గీ. మప్సరస్స్పృహణీయలీలాతిశయవి
లాసినీజననేత్రవిలాసజనిత
కుసుమశరబాణవైహృత్య మసదృశార్థ
నిర్జితాలక ముజ్జయినీపురంబు. (ఆం) 49