పుట:Prabandha-Ratnaavali.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నమరాజు, కానుకొలను [అమరుకము] (ఆం)
చ. చులుకనఁ జాపముం దిగుచుచోఁ గటకాముఖపాణిమీఁదఁ బొ
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు కెంజిగురాకుగుత్తిచే
నలవడి కర్ణపూరమున నంటిన తుమ్మెదవోని పార్వతీ
లలన కటాక్షదృష్టి మనలం జరితార్థులఁ జేయుఁ గావుతన్. (ఆం) 5

సీ. తివిరిరాశికి నెక్కి తిరుగు చక్రంబులు మెట్టులఁ బదిలమై మెఱయుతేరు,
బహుముఖంబుల నేర్పు పచరించుసారథి వ్రాసి చూపఁగరాని వారువములు,
గట్టియై వీఁక నక్కఱఁ దీర్చు విలుగమ్మి శ్రుతిహితంబుగ మ్రోఁత చూపునారి,
విజయానుకూలమై విలసిల్లుబాణంబు సరిలేనికోటుల సంఖ్యబలము,
గీ. దనకు నబ్బుటయునుఁ బురత్రయము గెలిచి
పృథుల విఖ్యాతిఁ గైకొన్న రథికవరుఁడు
జయముఁ దేజంబు భూతియుఁ బ్రియమెలర్ప
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుగాత. (ఆం) 6

అన్నమయ్య, తాళ్ళపాక [తిరువేంకటేశ్వరశతకము]
చ. అరిసెలు నూనెబూరెలును నౌఁగులుఁ జక్కెరమండెఁగల్ వడల్
బురుడలు వాలమండెఁగ లపూపము లయ్యలమేలుమంగ నీ
కరుదుగ విందువెట్టెఁ బరమాన్నశతంబుల సూపకోట్లతో
నిరతవినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా! (ఆం) 7

అప్పన్న [చారుచర్య] (జ)
సీ. కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా ర్థప్రమాణము ప్రాఁతఁదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై యొత్తినతరవాయి శశమాంసఖండంబు చంద మగుచు
నొగరించుకయు లేక మిగులంగఁ దీపైన క్రముకంబు; నొఱ్ఱనై కమ్మవలచి
దళమెక్కి పండినతాంబూలదళములు; కాలోపలంబులు గాల్చి వడియ
గీ. నూని కట్టిచ్చి చూర్ణంబుగా నొనర్చి
భుక్తి గొనక ముందట నాల్గు భోజనోత్త
రమున రెండును నటమీఁద రాత్రి యాఱు
మార్లు తమ్ముల మొప్పారు మంత్రియప్ప! (జ) 8