పుట:Prabandha-Ratnaavali.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

సర్వదేవుడు (క్రీ. శ. 958)

సర్వ దేవుని తెలుగుకవులు స్తుతించిరి. ఎడపాటి ఎఱ్ఱన మల్హణ చరిత్ర లో.

చ. వినుతియొనర్తు నాంధ్రసుక విప్రభు నన్నయభట్టు తిక్కయ
జ్వను శివదేవు భాస్కరుని, జక్కన నాచనసోము సర్వదే
వుని భవదూరు వేము నలపోతన పిల్లలమర్రివీరభ
ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి కేతన భట్టబాణునిన్ .

ఎఱ్ఱున క్రీ. శ. 1500 ప్రాంతమువాడు.

దీనినిబట్టి తెలుగున సర్వదేవుడన్న కవి యున్నట్లు మనకు తెలియ గలదు.

ఈ సర్వదేవుడు కన్నడ రత్నత్రయమని ప్రసిద్ధిగన్న పంప, పొన్న, రన్న లలో- పొన్న అనునతడు. ఈతడు కన్నడ భాషలో శాంతిపురాణము ఆను గ్రంథము రచించి, ఆందు ద్వాదళాశ్వాసమున నిట్లు చెప్పుకొన్నాడు;

మ. సకలజ్ఞ కవిచక్రవర్తి జినచంద్రేంద్రంగ సద్భక్తిపూ
ర్వక దిందమ్మన భక్తినుంత దనుజాతం పొన్న నుం పేఱువదం
దుకర ప్రార్థిత శాంతి నాథ కథయం వేసప్పనం సర్వదే
వకవీంద్రం బరదంబుధర్ పొగఱిసం తన్నం మహోత్సాహదిం.

పైపద్యమువలన పొన్నకవియే సర్వదేవకవి యని నిశ్చితమైనది. పొన్నక వికూడ పంపకవి వలే తెలుగువాడే. ఆతడు వేంగీదేశమున కమ్మ నాటిలో పుంగనూరు వాస్తవ్యుడు,

ఆదిపురాణము

సర్వదేవకవి రచితమైన పై గ్రంథమునుండి రెండు పద్యము లుదాహ రింపబడినవి. అందొక మత్తేభము ఒక కందము గలవు.

క. హరినీలమణి విరాజిత
సురుచిర గోపురముదగిలి చూచి తమిస్రా
కరుడు విధుంతుదమండల
పరిశంకంజేసి పురముపై జననోడున్,