పుట:Prabandha-Ratnaavali.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130 ప్రబంధరత్నావళి

చ. జనసుతులౌ కవీశ్వరుల సత్కృతిసారము కావ్యసార వ
ర్ణనమని చేసి నీలగిరినాథుని కర్పణ సేయుటొప్పుఁ జ
క్కనిపదియాఱువన్నెకనకంబున వాసన కమ్మకస్తురిన్
గనదురు కాంతియును, జెఱకునన్ ఫలమబ్బుట భాగ్యమే కదా! 6

వ. అని కృతనిశ్చయుండనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునఁ గావ్యసారం బొనరింపఁ బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద. 7

సీ. తన ప్రభుత్వము దేవతాప్రభుత్వమున కెం తయు నొప్పు వేయు నేత్రముల వానిఁ
దన లావుననె భూతధాత్రీతలం బెల్లఁ దలఁ బూనుకొను వేయు తలల వానిఁ
దనపేరుఁ దడవిన జనుల పాపౌఘముల్ మర్దించు వేయు నామముల వానిఁ
దన మూర్తి త్రిభువనతమస మౌల సనంగఁ దఱిమెడు వేయుఁ పాదముల వానిఁ
తే. దనదు కూరిమిసుతునిఁగాఁ గనిన వానిఁ
దరమె వర్ణింప సంతతోదారకీర్తి
ననుపమజ్ఞానమూర్తి దయానువర్తి
భవ్యగుణఖనిఁ గశ్యపబ్రహ్మమౌని. 8

శా. ఆ మౌనీంద్రుశుభాన్వయప్రకటదుగ్ధాంభోధిశుభ్రాంశుఁ డౌ
రామప్రెగ్గడగంగరాజునకు విభ్రాజద్యశస్స్ఫూర్తి వ
ల్లామాత్యుం డుదయించి కాంచె నురుభవ్యాకారులన్ బేర్మి రా
మామాత్యాగ్రణి గంగరాయని సముద్యద్బంధుమందారులన్. 9

వ. అందగ్రజుండు. 10

ఉ. దండెగు[?] ప్రత్తిపాటిపురధాముఁడు వల్లన రామమంత్రి తా
నిండిన వేడ్క నారరథినీపతి వీరమనున్ వివాహమై
కొండయ తిమ్మమంత్రిమణికోవిదులం గనియెం బ్రసూనకో
దండజయంతతుల్యసముదంచితరూపవిలాసవంతులన్. 11

వ. తదనుజుండు. 12

చ. శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్ మనో
హరగుణశాలి గంగసచివాగ్రణి సమ్మతిఁ బెండ్లియాడె నా
హరితపవిత్రగోత్రుఁడగు నబ్బురిలింగన కూర్మిపుత్త్రి సు
స్థిరగుణధాత్రిఁ జానమ నశేషశుభాంచితగాత్రి నుర్వరన్. 13