పుట:Prabandha-Ratnaavali.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము – 1

సీ. శ్రీకరనవపుండరీకసంపదలకుఁ గవయైన నేత్రయుగ్మంబుతోడ,
శంఖశార్ఙ్గస్ఫురచ్చక్రగదాశోభి తములైన హస్తపద్మములతోడ,
నూర్జితమకుటకేయూరకౌస్తుభచారు రమణీయమణిభూషణములతోడఁ,
బదియాఱు వన్నెల పసమించుతళుకుల వలనైన పసిఁడిదువ్వలువతోడ,
గీ. నిరతమును గూర్మి మీఱి పేరురమునందుఁ
గాఁపురంబున్న దుగ్ధాబ్ధికన్యతోడ
శ్రీజగన్నాథుఁ డెలమి నాశిత్రనిధాన
మర్థిఁ గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి. 1

సీ. నీలాచలాగ్రసన్నిహితనివాస! వాసవార్చితదివ్యవస్తునిరత!
రతగోపకన్యకాచతురతాతత్పర! పరతత్త్వవాసనాప్రకటసార!
సారసోధ్బవనుత! శయనపారావార! వారణోద్ధర దయావరవిశేష!
శేషాహితల్ప! సుస్థిరసచ్చిదానంద! నందవ్రజస్ఫుటోన్నతవిహార!
గీ. హారకేయూరమకుటమంజీరవిసర!
సరసభూషణభూషితస్ఫారరుచిర!
చిరదయాలోల! రక్షణస్నేహవిజయ!
జయ జగన్నాథ! దేవతాసార్వభౌమ! 2

గీ. అనుచు వినుతించువారు నాదు నెమ్మనను సెలఁగ
ననఘుఁ డాద్యుండు పురుషోత్తమాఖ్యపురపు
శ్రీజగన్నాయకుండు సమాశ్రితనిధాన
మాదరంబున నిట్లని యానతిచ్చె. 3

ఉ. అరయ రామప్రెగ్గడ కులాగ్రణి గంగయమంత్రిజగ్గ! మా
పేరిటివాఁడ, వెప్పుడును బ్రేమ ఘనంబుగు మాకు నీపయిన్,
గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం
పారఁగ మత్సమర్పణము నన్వహకీర్తిగఁ జేయు నావుడున్. 4

వ. మనమునఁ బ్రమోదాయత్తుండనై యిట్లని వితర్కించితి. 5