పుట:Prabandha-Ratnaavali.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. విరహులకెల్ల సంధ్యపతి వేడుక జోతము సెప్పవచ్చుచో
నితరముతోడ నక్షతలు నించి తగన్ గరపంకజంబునన్
మురియుచుఁ బట్టునా మెఱుఁగుముత్తెపుఁజిప్పన నొప్పెఁ జూడ్కికిన్
శరనిధిపుత్రునిన్ విదియచంద్రునిఁ గంటిరె పశ్చిమంబునన్. (ఆం) 601

సీ. విషమాస్త్రునకు వేఱ విండులు గలవెట్టు పొలఁతుక నెలవంక బొమలు గాక,
యంగజునకు వేఱ యమ్ములు గలవెట్టు తనుమధ్యలోల నేత్రములె కాక,
శంబరారికి వేఱ చక్రంబు గలదెట్టు బింబోష్ఠి పృథుజఘనంబ కాక,
చిత్తజునకు వేఱ చిగురెల్లి గలదెట్టు ధవళాక్షి యధరపల్లవమ కాక,
గీ. కాయజునకు వేఱ కవదొనల్ గలవెట్టు
తోయజాస్య పిన్న తొడల కాక
భావజునకు వేఱ పాశంబు గలదెట్టు
తరుణి కేల కాక ధరణినాథ! (ఆం) 602

సీ. వెన్నెలపులుఁగుల వెన్నెలపులగంబు చెఱకుసింగిణికాని చెలిమికాఁడు,
వేయికన్నులవాని వీటిపొత్తులమేఁత జోడువాయనివారి చొక్కుమందు,
కలువచుట్టంబు చుక్కలకెల్ల మను[?] భ్రాంతి వేడుకకాండ్రచే వెన్నుతఱటు,
మబ్బుమూఁకలకెల్ల నబ్బూచి పెనువేల్పు తలపూవు రేకొమ్మ వలపులాఁడు,
గీ. కలిమిముద్దియసైతోడు కడలిపట్టి
జక్కవలమిత్తి తామరచల్లఁజంపు[1]
దొంగలకు గొంగ యల ప్రొద్దుసంగడీఁడు
పొడిచెఁ బున్నమ రేఱేఁడు పొడుపుఁ గొండ. (ఆం) 603

చ. వెలయుకళాఢ్యుఁడైన శశి వేడుకఁ జేయు రతోత్సవంబునన్,
లలితరుచి స్ఫురద్గగనలక్ష్మి మనోహరహారమౌక్తికం
బుల క్రియ నున్న తారకలు పూర్వసురాధిపుభాగ్యచిహ్నముల్
తొలఁగినమాడ్కి దృష్టిపథదూరములయ్యెఁ గ్రమక్రమంబునన్. (జ) 604

చ. వెలవెలఁబాఱె దీపములు వెన్నెల వెల్లువ డొంకఁబాఱె ను
త్పలములజోకలెల్ల దిగఁబాఱె రథాంగము లించు వేడ్కలన్
గలగొనఁ బాఱెఁ దుమ్మెదలు కంజవనంబులు చేరఁబాఱెఁ దా
రలరుచి మాఁగువాఱె సురరాజదిగంతయు తెల్లవాఱఁగన్. (ఆం) 605

  1. చల్లఁజంపులు జోగిజంగమంబులు. చూ. హరవిలాసము