పుట:Prabandha-Ratnaavali.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. రాజకదంబవిరాజితంబగుఁ గాని కంటకపార్థివోత్కరము గాదు,
పద్మాలయాతిశోభన మనం జనుఁ గాని కుముదోదయాతి సంకులము గాదు,
స్నిగ్ధసువర్ణప్రసిద్ధాత్మమగుఁ గాని పరచిత్రవర్ణసంకరము గాదు,
పరమౌషధిప్రభాభాసురంబగుఁగాని దుస్తృణద్యోతవిద్రుతము గాదు,
గీ. వరకులంబును సత్సరోవరకులంబు
చెలువమగు హర్మ్యకులము సుక్షేత్రకులము
పోల నిన్నింటితో దానిఁ బోలియున్నఁ
బ్రస్తుతంబగు నోషధిప్రస్థపురము.[1] (ఆం) 596

ఉ. రాజితతేజుఁ డైన దినరాజు తిరోహితుఁడైన పిమ్మటన్
రాజు దయాద్రిపీఠము తిరంబుగ నెక్కెడు సందుకట్టునన్
భ్రాజితసత్పథంబులకు బాధ యొనర్చుచు జారచోరసం
పూజితమై తమంబు గడుఁబొంగె నధర్మముతోటి జోటియై. (ఆం) 597

ఉ. లేమికి లేఁత కౌను, ప్రతి లేమి కుదాహరణంబు రూపు, మా
ర్లేమికి మచ్చుచూడ్కులగు లేమివిలాసము వల్లిచిత్రముం
దామరఱేకులుం గల కతంబునఁ బోల్పఁదలంచి లోకు లా
నామములెన్నవాతెఱవ నాలుక యాడునె మై వడంకదే. (ఆం) 598

క. లోకము విరహులకును శశి
భీకరుఁ డగుటరుదె? సురలు పీఁకుకతినఁగా?
నాకాశపిండమై తిరి
గే కుటిలాత్మునకు నేడ కృప మదిఁ దలఁపన్. (జ) 599

సీ. విటసేనపై దండువెడలిన వలఱేని గొల్లెనపై హేమకుంభ మనఁగఁ
గాముకధృతివల్లికలు ద్రుంప నెత్తిన శంబరాంతకుచేతి చక్ర మనఁగ
మరుఁడు పాంథశ్రేణి మానాటవులు గాల్పఁ గూర్పిన నిప్పులకుప్ప యనఁగ
విరహిమృగంబుల వేఁటాడ మదనుండు దెచ్చిన మోహనదీప మనఁగ
ఆ. వీఁకునునుపు గలిగి వృత్తమై యరుణమై
కాంతితోఁ జకోరగణము లుబ్బఁ
బొడుపుఁగొండ చక్కిఁబొడిచె రాకాచంద్ర
మండలంబు గగనమండనంబు. (ఆం) 600

  1. నన్నిచోడని కుమారసంభవములోనిది 7.127