పుట:Prabandha-Ratnaavali.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. దుహినకుధరసుతావాసమహిమచేతఁ
దనదు గంగాధరత్వంబు తథ్య మనఁగ
శౌరి కే ప్రొద్దు సంతోషకారి యగుచు
నొప్పు నొప్పులకుప్ప నా నప్పయోధి. (ఆం) 591

ఉ. బాలముఖేందుబింబరుచి పద్మనిభానన యాన లీల నీ
లాలక చన్నుదోయి రుచిరాంగి మనోజ్ఞవిలాసహాసముల్
లోలకురంగలోచన విలోకనసంపద నెట్టువోల్చినన్
బోలినఁ బోలు నారతముఁ బోలఁగ నీ త్రయి నొండు గల్గునే? (ఆం) 592

శా. బేటంబై దృతి పల్లటిల్లఁదొడఁగెన్ బ్రేమంబు వట్రిల్లె నా
రాటం బుజ్జనమయ్యె లజ్జ యెసఁగెన్ రాగంబు వాటిల్లెఁ బు
య్లోటం బుత్కటమయ్యెఁ గంపములపై నుప్పొంగెఁ బ్రస్వేద మ
జ్జోటిం జెప్పఁగ విన్నమాత్రఁ బతికిన్ సూనాస్త్రుబేటంబునన్. (ఆం) 593

సీ. భసితంబు వేదోక్తపదనిరూఢంబగు భసితంబు మునిజనప్రాణపదము
భసితంబు సర్వేశుభక్తి కాధారంబు భసితంబు సకలశుభప్రదంబు
భసితంబు దుర్మేఘపటలానిలంబగు భసితంబు లోకైకపావనంబు
భసితంబు భవరోగభంజనౌషధమగు భసితంబు ప్రత్యక్షభర్గమూర్తి
గీ. భసిత మనవరతాశేషభయహరంబు
భసిత మసమసుజ్ఞానవైభవకరంబు
భసిత మాభరణము యోగివిసరమునకు
భసితమహిమ వర్ణింపఁగ బ్రహ్మతరమె? (ఆం) 594

సీ. మొగమును మొగమును ముచ్చట లాడంగ నగవును నగవును నవ్వియాడ,
మోవియు మోవియు ముద్దులు గురియంగఁ జూపును జూపును దీపులాడ,
నొడలును నొడలును నొక్కటియై యుండఁ బులకలు పులకలుఁ గలయఁబడగఁ
దొడలును దొడలును దొడరి పెనంగఁగ నడుగులు నడుగులు నదిమి కొనఁగ
గీ. వరుసఁ దలయంపిఁ జేతులు సరసమాడ,
నితరకరములు పైనొప్ప రతుల యెడల
సరస శయనించి పరిరంభసంభ్రమముల
వ్రేతలును దాను సుఖియించె విశ్వవిభుఁడు. (ఆం) 595