పుట:Prabandha-Ratnaavali.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అతి మాధుర్యమనోజ్ఞ చూతఫల మాహారంబుగాఁ గల్గియున్
మతి గర్వింపక కోకిలంబు వలుకున్ మంజూక్తి, జంబాల దూ
షిత నీహారముఁ గ్రోలి భేక మఱచున్ జృంభించి యాకర్ణ [న]
స్థితిఁ గాఠిన్యము దోఁపఁగా ‘బెకబెక’ స్పీతకులారావముల్. (జ) 544

మ. అనిలోద్ధూత పరాగరేఖలు సముద్ధ్యచ్చంచలా లీలఁగా,
ఘనమత్తాలి గభీరగానరవముల్ గర్జావిభూతిం దన
ర్ప, నమందంపు మరందబిందుతతి వర్షస్ఫూర్తి నొప్పారఁగాఁ
దనరెం గారుమొగిళ్ళ, పెల్లున [ను] నుద్దండోత్పలవ్రాతముల్. (జ) 545

గీ. అమరనాయకు కొలువుకూటమున యందుఁ
గరము విలసిల్లు వెలిపట్టుఁ దెరయపోలెఁ
జెలువమై తూర్పుదిక్కునఁ దెలుపు దోఁచెఁ
బ్రజలకెల్లను గన్నులపండువగుచు. (ఆం) 546

గీ. అమరు లమృతాబ్ధి లోపలి యమృతరసము
వెండిచేరులఁ బటికంపుఁగుండఁగట్టి
చేఁదుకొనియెదరో నాఁగ శీతరోచి
మెల్లమెల్లన రుచులతో మిన్ను వ్రాఁకె.[1] (ఆం) 547

ఉ. అరయక మున్ను పుష్పవతియైన లతాసతిముట్టి యంబుజా
కరముల నీళ్లులాడి మఱిఁగ్రమ్మఱ ముట్టెదమొక్కొ యన్వెఱం
బొరిఁ బురవీథులం దెరలఁబోవక మెల్లనఁ బోవునట్టివై
పరిమళ శైత్యమాంద్య సులభంబుగఁ బల్మఱు వీచుఁ దెమ్మెరల్. (ఆం) 548

శా. ఆనందాశ్రుల నగ్నినిల్చె నొకొ నా నల్లాడు దృగ్దీధితుల్
మానం బుష్పమధుప్రసంగము కడున్ మత్తిల్లెనాఁ గ్రుమ్ముడుల్
జానై క్రాలఁగ మంథరస్థితి నిజేచ్ఛన్ షోడశావస్థలున్
బూనం బొందఁగఁ దద్దయొప్పి రరుణాంభోజాక్షు లున్మత్తలై. (ఆం) 549

ఉ. ఆరయ జీవనంబమృత, మల్లుఁడు దేవర, సొమ్ములన్నియున్
సారపురత్నముల్, కొడుకు చంద్రుఁడు, కూఁతురు లక్ష్మి, యాలు భా
గీరథి, తా సముద్రుఁడని కీర్తన సేయుదు రెల్లవారు నా
క్షీరపయోధి, నన్యులకుఁజెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్. (ఆం) 550

  1. మెఱుఁగు మెఱుతోన యల్లన మిన్నువ్రాఁకె (పాఠాం)
    చూ. పారిజాతాపహరణము 2.40