పుట:Prabandha-Ratnaavali.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. సుకవులు పలుకఁగఁ గెళవులు
కుకవులు దా రఱతు రౌర! కొలఁకుల భ్రమర
ప్రకరము ఝంకారింపఁగ
‘బెకబెక’ మనకేల మాను భేకము లవలన్. (జ) 515

సోముఁడు [వసంతవిలాసము] (జ)
శా. ప్రాలేయప్రతిసీరసేనఁబఱపెన్ బైపై వసంతంబిలన్
గాలోన్మీలిత కోరకోదరపరాగ ప్రౌఢ కోపాగ్నియై
హాలాపాన విహారపౌరమహిళాలంకార దోస్సారమై
హేలాపల్లవ హేతిఖండిత మహాహేమంత సామంతమై. (జ) 516

సోమేశ్వరుఁడు, పాలపర్తి [?] (జ)
సీ. తలకమ్మికొండయు విలుకమ్మికొండయుఁ గడయును నడుముగాఁగలుగు తేరు
సరసిజ ముకుళంబు సద్వాక్యసకలంబు మాతయు నా లగు మాతలియును,
మిన్నులఁ జనువాఁడు కన్నుల వినువాఁడు నంకపర్యంకంబులైన శరము,
చల్లనిపవనంబు నెల్లైనభువనంబు మేపును మోపుగా మెలఁగు నారి,
ఆ. కాఁక కోర్చువిల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేయుఁదిరుగు బండికండ్లు
గలుగఁ బురజయంబు గైకొన్న నినుఁగొల్తు
చిరశుభాంక! సోమశేఖరాంక! (జ) 517

సీ. వింటిక్రిందటికొమ్ముఁ వికలించి పెఱికిన భూకాంతకును నాభి పొలుపు మిగిలె,
నమ్ముపుచ్చుకొనఁగ నమిత తరంగముల్ పాలసంద్రంబునఁ బ్రజ్వరిల్లె,
బండికండులు రెండు పండ్లిగిలించినఁ గలువలు దామరల్ చెలిమి చేసె,
వాజులఁగొనివచ్చి వర రథంబున బూన్పఁ జిచ్చుకు నాఁకలి చిచ్చు వుట్టె,
గీ. నారి సంధింపఁ గశ్యపునారి వడఁకెఁ
గోల సంధింప లచ్చికి గోల పుట్టె
విల్లుఁదెగఁబాపి పురములు ద్రెళ్ళనేసి
తరిది విలుకాఁడ వౌదు వో శరభలింగ! (జ) 518