పుట:Prabandha-Ratnaavali.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. ప్రతిభావిలంఘితభారతబహుకథాఘట్టు నన్నయభట్టుఁ గడు భజించి,
యుభయభాషాప్రౌఢిమోద్యన్మహారాజ్యభాజిఁ దిక్కనసోమయాజిఁ బొగడి,
వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థానభీము వేములవాడభీముఁ గొలిచి,
భావబంధ నిబంధ పరమేశబిరుదప్రశర్ము నెఱ్ఱయశర్ము సన్నుతించి,
గీ. భారతీహారు భవదూరుఁ బ్రణుతి సేసి
సుకవికులసోము నాచన సోమునెన్ని,
నవ్యకవితాసనాథు శ్రీనాథుఁ దలఁచి
సరససకలాంధ్రకవుల కంజలి యొనర్చి. (జ) 496

ఉ. బంటుతనంబు వైభవము భాగ్యము తేజము చాలఁగల్గ ము
క్కంటిని దమ్మికంటి నధికంబగు భక్తి భజించి కేలిమైఁ
గంటకులం జయించి కలకాలము నర్థులకోర్కిపంటలై
పంటలుఁబాఁడియుంగలిగి పంటలు మీఱుదు రప్పురంబునన్. (జ) 497

సీ. భ్రమరికావళికప్పు ప్రసవగుచ్ఛభ్రమ ద్భ్రమరకావళికప్పు బాంధవింప,
కరములకెంపును గమనీయహల్లకో త్కరములకెంపు సఖ్యంబు సేయ,
ముఖసౌరభములు నమోఘాతిముక్తక ముఖసౌరభంబులు మొనసి బెరయ,
హాసవిస్ఫూర్తులు నతులవర్ణప్రతి హాసవిస్ఫూర్తులు నణఁగి పెనఁగ,
తే. సారములగు తమ్ముల విలాసములు చూపి
వరుసఁబువ్వులు జట్టికోవచ్చినట్టి
జనుల మనసులు మును తీరు జట్టికొండ్రు
పుష్పలావీవధూటు లప్పురమునందు. (జ) 498

ఉ. రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
రాజులు రూపరేఖ రతిరాజులు మానగుణంబునందు రా
రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
రాజులనంగ నొప్పుదురు రాజితతేజులు దత్పురంబునన్. (జ) 499

చ. వలుఁదకుచంబులున్ బవడవాతెఱలున్ మెఱుఁగారుమేనులున్
బలుచని చెక్కుటద్దములుఁ బద్మపుమోములుఁ గంబుకంఠముల్
కలువలఁబోలుకన్నులు వికాసపునవ్వులుఁ జిల్కపల్కులున్
దలిరుల మించుపాదములుఁ దత్పురికాంతల కొప్పు నెంతయున్. (జ) 500