పుట:Prabandha-Ratnaavali.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. నర్తకేళిలాస్య నటనాగతులచేత
శాస్త్రసమ్మతముగ జనులకెల్ల
వేడ్క సూపి మఘవవిభవుఁడై కొలువుండ
వలయు విభుఁడు నిఖిలకళలు నెఱిఁగి. (జ) 491

సీ. మొదలిపుష్పాంజలి ముదమునఁ గావించి కరబాళిమొగబాళి సరవులెత్తి,
యురుపృథుబాళము లొగిఁబిల్లమురువును హస్తప్రకణము లే ననువుచఱచి,
కడకట్టుశబ్దంబు కడఁగి దర్వును జిందు బాగైన గీతప్రబంధములును,
కుండలి బహురూపదండలాస్యవిలాస దేశిమార్గంబుల తెరువులెఱిఁగి,
గీ. నయము బిఱుసును, నరిగతుల్ కడిఁది గాను
తిరువుమురువును నిలుకడ తిన్ననగుచు,
పాత్రఁ గొనిపించఁ గొనఁగను బ్రౌఢియైన
వాఁడె నటుఁడనఁబరఁగు నీ వసుధయందు. (జ) 492

సోమయ, పెదపాటి [అరుణాచలపురాణము] (జ)
సీ. అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్గు చదువంగ నేరని సద్ద్విజాతి,
బ్రాహ్మపాద్మాదిపురాణాగమేతిహా సములెఱుంగని బ్రహ్మసంభవుండు
భాట్టవైశేషిక ప్రాభాకరాది శా స్త్రములాఱు చూడని ధరణిసురుఁడు
స్వకులోచితములైన సప్తతంతువులెల్లఁ బార మెయ్దింపని బాడబుండు
తే. కావ్యనాటక లసదలంకార ముఖ్య
విద్యలన్నియు నెఱుగని విప్రవరుఁడు
పంచయజ్ఞంబులును లేని బ్రాహ్మణుండు
వెదకిచూచినఁ బొడమండు వీటిలోన. (జ) 493

క. తఱుముదు రంతకునైనను
వెఱచఱవఁగ భద్రకరుల విఱుతురు హరి ను
క్కఱఁబట్టి చట్ట లేరుదు
రుఱుకుదురు యుగాగ్నినైన నురుభటులందున్. (జ) 494

ఉ. తారకజిచ్ఛిఖండి శివతాండవమాడ నతండు మర్దళో
దార రవంబు మేఘ నినదంబని చేరినఁజూచి నాసికా
ద్వారబిలంబు జన్నిదపు వ్యాళము చొచ్చినఁ దొండమెత్తి ఘీం
కారము సేసి నవ్వువెనకయ్య కృతీశ్వరు మన్చుఁగావుతన్. (జ) 495