పుట:Prabandha-Ratnaavali.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. జలజ కాహళకదళికా పులినగహన
కోకబిసశంఖచంద్రాళికులముఁ దెగడు
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు
బాహుగళ వక్త్ర కచములపణ్యసతులు. (జ) 475

సీ. తిమిరమంతయుఁ బాసి దిక్కులు తెలివొందె నమృతాంశువులు సెందె నభ్రవీథిఁ
గువలయానందమై కోరిక లిగురొత్తె విబుధులమదిలోన వెట్టలొదవె
నక్తంచరశ్రేణి నయమెల్ల దిగజాఱెఁ జిత్తజోల్లాసంబు చెలువుమిగిలె
దివ్యనీరంబులతేట లల్లనఁ బర్వె భువనాధిపతి వేడ్కఁ బొంగి పొరలె
గీ. దీపికాజాలమెల్లఁ జిత్రించినట్టి
రమణఁ దోఁపంగ దృక్చకోరములు మెచ్చ
నమిత తేజోవిరాజమానాత్ముఁడైన
పుత్త్రచంద్రుండు జననము వొందునపుడు. (జ) 476

క. నిరుపమ ధర్మస్థితిచే
వరపాతివ్రత్యనిరతి వైభవమున న
ప్పురిపుణ్యకాంత లమరిరి
గిరిదత్పురివాణులెల్లకీర్తితగతులన్.[?] (జ) 477

శా. ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్ప్రకారముల్ హేమముల్
సూచింపన్ ఘనవేదకుట్టిమము లా శుభ్రాంశుకాంతంబులై
యే చోట న్వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్
వాచాగోచరమై గృహంబులమరున్ వస్తుప్రశస్తోన్నతిన్. (జ) 478

ఉ. మీఱిన భద్రనాగములమీఁదికి దాఁటి తదీయకుంభముల్
చూఱలు వట్టి కేసరికిశోరనఖావళినుండి రాలి సొం
పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్
గీరనగింజలాడుదురు గేలిఁ దలిర్పఁగఁ బక్కణంబులన్. (జ) 479

ఉ. వైరితమస్తమం బడఁగ వంశమాహార్ణవ ముబ్బ బాంధవో
ద్ధార చకోరసంతతి ముదంబునఁ దేలఁగ నర్థివర్గ స
త్కైరవజాతమెల్లను వికాసముఁ బొందఁగఁ బుత్త్రచంద్ర జ
న్మారవచంద్రికానుభవ మబ్బిన చిత్తము మిన్నుముట్టదే? (జ) 480