పుట:Prabandha-Ratnaavali.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. అట్టి వేలుపు శంకరుండాదిమూర్తి
వేదవేదాంతవేద్యుండు విశ్వభర్త
విసకితోజ్జ్వల వదనారవిందుఁ డగుచు
నుచిత రీతిఁ బేరోలగం బున్నయంత. (ఆం) 462

శా. సంతోషంబునఁబొంది యేలె విమలస్వాంతున్ మహాదానవ
ధ్వాంతవ్యూహవిదారణోజ్జ్వల వివస్వంతున్ యశఃపూరితా
శాంతున్ సాహసవంతు నిర్భర జయాయత్తైకవిశ్రాంతు ధీ
మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్. (ఆం) 463

శ్రీనాథుఁడు [వల్లభాభ్యుదయము] (జ)
సీ. రజనీవధూకర్ణ రజతతాటంకంబు వలరాజు ధవళోష్ణ వారణంబు
ప్రోషితయువతి హృత్పుటభేదదాత్రంబు బహుచకోర కుటుంబ పానపాత్ర
మధుకైటభాసుర మథనుదాఁపటికన్ను చక్రవాకంబుల చల్లచేఁపు
దుగ్ధపాథోరాశి తొలిచూలిసంతతి రోహిణీదేవితారుణ్యఫలము
తే. చంద్రకాంతశిలానునిలకృపీట[?]
నిర్జరాంధోవ్యథా మోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటా హలాహలహరుండు
చంద్రుఁడొప్పారెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు. (జ) 464

శ్రీనాథుఁడు (?) [నైషధము] (ఆం)
సీ. మించి కన్నులఁ గోరగించు రాజాన్నంబు లొలుప యించుకలేని యొలుపుఁబప్పు
అభినవసంతప్త హైయంగవీనంబుఁ బరువంపు రుచినొప్పు పాయసములు
నేతను మిరియాల నెనసిన కూరలు ఖండశర్కరతోడఁ బిండివంట
గ్రొజ్జుగాఁ గాంచిన గోక్షీరపూరంబుఁ బనస రంభా చూతఫలచయంబు
గీ. ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు
బహుసుగంధిరసావళు ల్పానకములు
పెక్కువిధముల పచ్చళ్ళు పెరుగు మజ్జి
గయును వడ్డించి రెంతయుఁ గ్రమముతోడ.[1] (ఆం) 465

  1. ఈ పద్యము నైషధమున గానరాదు.