పుట:Prabandha-Ratnaavali.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. సరసులపొందు గల్దనఁగఁ జాలి బహూన్నతచారుశాఖలం
బెరిఁగి మహాద్విజావనమె పేర్చి నిజాయతిగాఁ దనర్చి ని
ర్భర జనతాపసంహరణపాత్రములయ్యు మహీజవాటికల్
పురివెలి నిల్చె మేటియు నపూజ్యుఁ డగున్ మధుపానుకూలతన్. (జ) 451

వల్లభరాయఁడు [వీథినాటకము] (జ)
సీ. చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమలదంష్ట్రాప్రరోహములవానిఁ,
బవడంపుఁగొనలతోఁ బ్రతివచ్చు ననవచ్చు కుటిలకోమలజటాచ్ఛటలవాని,
నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతరదేహకాంతివాని,
నుడురాజరుచులతో నొఱవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసములవాని,
గీ. సిగ్గుమాలిన మొలవానిఁ జిఱుతవాని
నెల్లగాలంబు ములికినాఁ డేలువాని
నర్థి మోపూర నవతారమైనవాని
భైరవునిఁ గొల్వ వచ్చిరి భక్తవరులు. (జ) 452

వీరయ్య, పిల్లలమఱ్ఱి [పురుషార్థసుధానిధి] (ఆం)
సీ. కాశకర్పూరనీకాశఁగా భావింపఁ గవితానిరూఢిఁ బ్రఖ్యాతి నెసఁగు,
యావకారుణదేహయష్టిఁ గాఁ జింతింప మదకుంభియానల మరులుగొలుపు,
నీలజీమూతసన్నిభఁగా విలోకింప సకలమాయాప్రపంచంబు నడఁచుఁ,
గనకచంపకధామగౌరిఁగా శీలింప నంహస్సమూహంబు సంహరించు,
గీ. శంభుదేవి విశాలాక్షి సదనుకంప
యోగిజనసేవ్య యోగపయోదశంప
శ్రీకర కటాక్షలేశరక్షిత నిలింప
ముజ్జగంబుల మొలిపించుమూలదుంప. (ఆం) 453

సీ. భర్గభట్టారకు పర్యాయమూర్తికి షాణ్మాతురుని కూర్మిజనకునకును,
మేషరాజము నెక్కుమేటిరౌతున కమరాధీశుపొరుగుదిశాధిపతికి,
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి సామిధేనీప్రియస్వాంతునకును,
యాయజూకులయిండ్ల యనుఁగుఁజుట్టమునకు స్వాహాస్వధాప్రాణవల్లభునకు,
గీ. దండములు వెట్టెదము మోడ్చెదము కరములు
సేవ యొనరించెదము మమ్ముఁగావు ప్రోవు