పుట:Prabandha-Ratnaavali.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11


గ్రంథములందలి పద్యముల నిందుఁ బొందింప మానితిని. అవియేల్ల వేఱొక కూర్పుగా వెల్లడించెదను.

పెద్దపాటి జగన్నాథకవి కృష్ణామండలమందలి యేలూరునకుఁ జేరువనున్న పెదపాడునం దున్నవాఁడు. తన గ్రంథము నతఁడు నీలాచలమందు నెలకొన్న జగన్నాథస్వామి కంకితము సేసినాఁడు. ఆతనివంశస్థితి మొదలగునది యీ గ్రంథము ననుబంధమును జూచి యెఱుంగునది.[1]

ఇర్వురుసంధాతలును గొంచె మించుమించుగా సమకాలమువారనియే తలఁపవచ్చును. మన మెఱిఁగినంతలో జగన్నాథకవి యుదాహరించినవారిలో మాదయగారిమల్లయ్య, తెనాలి రామలింగయ యును, రెండవసంధాత యుదాహరించినవారిలో నల్లసాని పెద్దనార్యుఁడును నర్వాచీనులు. జగన్నాథకవికంటే నిర్వదేండ్లు రెండవసంధాత ప్రాచీనుఁడయిననుఁ గావచ్చును.

గ్రంథమున నకారాద్యక్షరక్రమమున నుదాహరింపఁబడిన యధర్వణాదు లగుకవులను గూర్చియుఁ దత్తత్కృతులనుగూర్చియు దెలుపఁదగిననూత్నవిషయముల నిఁక నించుఁగొండొక వివరించుచున్నాఁడను. ఇందు నేను బేర్కొననివారింగూర్చి భావికాలపరిశీలనములవలనఁ గాని, నేఁడే యింతకంటే హెచ్చు పరిశీలించియుండిన ప్రాజ్ఞలోకము మూలమునఁ గాని విశేషవిషయములు బయల్పడవలయును.

అధర్వణాచార్యుఁడు:- ఈతనిభారతము లాక్షణికు లుదాహరించెదరు. 'తృష్ణాతంతు' అన్నపద్యము లక్షణగ్రంథమందలిదే. ఈతనియాంధ్రచ్ఛందస్సు నాకు లభింపలేదు. వికృతివివేక మనియు, త్రిలింగశబ్దానుశాసన మనియు సంస్కృతమున రెం డాంధ్రవ్యాకరణగ్రంథము లీతనిపేరఁ గానవచ్చుచున్నవి. ఈ రెండును నధర్వణునిపేర నిటీవలఁ గల్పింపఁబడినవే యని యూహ. "శ్లేషే సఖండ నిర్బింద్వో" రిత్యాదిలక్షణము లుండుటనుబట్టి యాయూహ యుక్తము కాఁ దోఁచుచున్నది. అరయఁగా, సంస్కృతమున నున్న యాంధ్రవ్యాకరణము లన్నియుఁ గొంతయసత్యకల్పనముతోఁ గూడినవిగనే కన్పట్టును. రా. బ. కందుకూరు వీరేశలింగము పంతులుగారు:-


  1. చూ. ఇందలి అనుబంధము-1, పుట. 128. (ప్రకాశకులు).