పుట:Prabandha-Ratnaavali.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 ప్రబంధరత్నావళి

త్రముగాఁ బంచశరుండు రాగరతిఁ జెంతంచూచుచున్ వ్రాసి ప్రా
ణము వాగీశ్వరు వేఁడి నించె నన మేనాపుత్త్రి యొప్పెం గడున్. (జ) 296

పేరయ్య, బొడ్డపాటి [సూర్యశతకము] (జ)
శా. ఈఁగల్వోలె వ్రణంబులే వెదకుచు న్నీర్ష్యం బరు న్మెచ్చ కే
మూఁగల్ వోలె నిరంతరాస్యులగుచున్ మూర్ఖించి తర్కించినన్
వీగఁ న్నేరని దుష్కవుల్ బ్రతుకనీ విక్రాంతులై వారినో
రాఁగం బోవఁగ నేల సత్కవులు సూర్యా! పద్మినీవల్లభా! (జ) 297

పోతరాజు [బేతాళపంచవింశతి] (ఆం)
చ. అరయఁగఁ బూర్వదిగ్వనితయం దనురక్తుఁడు ముంద ఱిప్డు భా
స్కరుఁ డిట వచ్చి నాదెసఁ బ్రశాంతముతో ననురక్తుఁ డయ్యె సు
స్థిర మిది యంచు నయ్యపరదిక్సతి రాగముఁ బొందె నాఁగ వి
స్తరముగ నిండఁ బర్వె నెఱసంజ నభంబునఁ బశ్చిమంబునన్. (ఆం) 298

క. ఇంటింటం జింతామణు
లింటింటం బరుసవేదు లింటింట నిధుల్
జంటగొని యుండు ధనపతి
యింటి క్రియన్ బురములోని యిండుల నెల్లన్. (ఆం) 299

ఉ. ఇందుల నున్న నగ్నిభయ మెందునుఁ గల్గదటంచు మున్ సురా
నందనమైన ఖాండవవనం బమరావతి వాసి వచ్చి పొ
ల్పొందఁగ మర్త్యలోకమున నుత్సవలీల వహించెనొక్కొ నా
నందనవనంబు లొప్పెఁ బురి నాలుగుదిక్కుల నున్నతస్థితిన్. (ఆం) 300

క. ధర మిన్ను దఱిఁగివైచిన
కరణిఁ దటాకంబు లెల్లకాలమునందున్
బరిపూర్ణములై యుండును
బురికి నవగ్రహభయంబు పొరయక యుండన్. (ఆం) 301

క. పురివిభవముఁ జూడఁగ న
త్కరమున [?] జలదేవి పెక్కుకన్నుల వెలయన్
ధరియించినట్లు వికసిత
సరిసిరుహాకరము లొప్పు సౌరభలీలన్. (ఆం) 302