పుట:Prabandha-Ratnaavali.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 ప్రబంధరత్నావళి

సీ. వరుణుని శృంగారవనములోఁ బొగడొందు పగడంపుఁదీగల ప్రాఁకనంగఁ,
జరమభూధరము పై సురగాలి నెగయింపఁ దోతెంచు జేగురుధూళి యనఁగ,
నస్తాంబురాశిలో నంతకంతకుఁ గ్రాలు బాడబానల శిఖాపటల మనఁగ,
నినురాక కపరదిగ్వనిత యెత్తించిన రత్నతోరణవిభారాజి యనఁగ,
గీ. విరియ నుంకించుచెందొవ విరులయందు
వఱలు ఱేకుల కాంతికి వన్నె వెట్టి
రమణ రమణీజనానురాగములతోడ
నిగిడి యెఱసంజ పడుమట నివ్వటిల్లె. (ఇ) 268

గీ. వారుణీస్పర్శమున నాదు వాఁడి దఱిగె
సకలతీర్థనిదాన మీ జలనిధాన
మే నొనర్చెదఁ బావనస్నాన మనుచు
మునుఁగుగతిఁ బశ్చిమాంబుధి మునిఁగె నినుఁడు. (ఇ) 269

శా. విఘ్నధ్వాంతనిరాసవాసరపతిన్ వేదండరాజాననున్
విఘ్నాధీశ్వరునిన్ గపోలఫలకావిర్భూతదానచ్ఛటా
నిఘ్నాళిన్ నిరుపాధికాధికకృపానిత్యోదయోపఘ్నుఁ గ్రౌం
చఘ్నజ్యేష్ఠు భజింతుఁ గావ్యరచనాచాతుర్యసంసిద్ధికై. (ఆం) 270

సీ. వికచారవిందదీర్ఘికల వినోదించి తని గమ్మతావుల ననఁగి పెనఁగుఁ,
గుసుమిత నవలతావిసరంబుఁ గదిలించి వలిదేనియల సోనఁ దలము గొల్పు,
సహకారపాదపచ్ఛాయలకై యేఁగి శశికాంతవేదుల సంచరించు,
సురతకేళీశ్రాంతి సొగియుముద్దియలపైఁ జిట్టాడితనువులఁ జెమట లార్చుఁ,
గీ. జంచరీకంబురీతిఁ బర్జన్యుభాతి
విరహపరితాపహరుమాడ్కి సురఁటిపోల్కి
నప్పురంబున సకలజనానుమోద
కరణదక్షుండు దక్షిణగంధవహుఁడు. (ఆం) 271

గీ. వెలయువెన్నెల నిఖిలంబు వెల్లివొడిచి
తనిసి చనుచోట నుడువీథిఁ దవిలియున్న
నురువుబుగ్గలు దోడ్తోన విరియుపగిదిఁ
దరతరంబ తారకములు విరియఁ దొడఁగె. (ఆం) 272