పుట:Prabandha-Ratnaavali.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 57

సీ. రక్షోవధూవృత్తవక్షోజపరిలిప్తకుంకుమక్షోభంబు క్రొవ్వుడించి,
శక్రారిమదవతీవక్రాలకాభోగఘనతమఃపరభాగగరిమ నడఁచి,
క్రవ్యాదయౌవనీగ్రైవేయమణిహారకహ్లారదీప్తులగర్వ మడఁచి,
దైవతాహితవీరతరుణీసముల్లాసదరహాసచంద్రికాదర్ప మడఁచి,
గీ. చటులసంవర్తపరివర్తచండకిరణ
శతశతాఖిలపరిదీప్తసారఘోర
దర్శనం బగునట్టి సుదర్శనంబు
గలుగ నీ కసాధ్యంబులు గలవె కృష్ణ! (ఆం) 264

మ. లలనల్ పాడఁగఁ గౌఁగిలింపఁగ సముల్లాసంబునం దాఁపఁ బైఁ
గలయం బుక్కిటికల్లు నింపఁ దిలకక్ష్మాజాతకాండంబుఁ గ్రో
వు లశోకంబులుఁ గేసర క్షితిరుహవ్యూహంబుఁ దోడ్తోఁ గడున్
దిలకించెన్ బులకించె నవ్వె నలరెన్ దీపించె నుద్యానముల్. (ఆం) 265

సీ. వనరుహామోదిని చనుదోయిప్రాపున ననులేపనములు వాసనకుఁ నెక్కఁ,
బూఁబోణి నెఱివేణిపొందు సంధిల్లుట నలరులు సౌమనస్యంబుఁ దాల్ప,
నంగనారత్నంబు నపఘనద్యుతుల సౌ వర్ణమండనములు వన్నె కెక్క,
ధవళాంశుముఖిమేనితఱచు గ్రొమ్మించుల వెలిపట్టుగుణరాజి నెలవుకొనఁగఁ,
గీ. జెలువ మసలారఁ బూసి వేడ్కలు జనింప
ముడిచి బెడఁగుగఁ దొడిగి సొంపడరఁ గట్టి
గట్టినేర్పులు దళుకొత్తఁ గంబుకంఠి
కాచరించిరి శృంగార మాత్మసఖులు. (ఆం) 266

సీ. వరుణుండు కానిక పురుహూతునకుఁ దెచ్చి ప్రోవిడ్డ నవరత్నపుంజ మనఁగ,
నుదయాద్రితటములో నున్నాళమై మున్ను వికసించు రక్తారవింద మనఁగఁ,
గాశ్మీరరసపూరకమనీయమగు శచీసఖిచేతికల్యాణచషక మనఁగఁ,
బ్రాచి కందుకకేళిపరత మింటికి వైవఁ బొల్పారు మందారపుష్ప మనఁగ,
గీ. నడరు కెంజాయ మండలం బతిశయిల్ల
నఖిలభూసురదత్త సంధ్యార్ఘ్యతోయ
దళితమందేహుఁడై జగంబులు వెలుంగ
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు. (ఆం) 267