పుట:Prabandha-Ratnaavali.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 55

సీ. పల్లవాధరతోడఁ బలుకులయింపుల[?] నరయంగఁ బికము పోల్ననుట పికము
నలినాక్షి వేనలి చెలువుతో సరిసేయఁ బురులెంత పురినెమ్మి పురులపొలుపు?
తనుమధ్య నడముతో నెనవచ్చు ననిచూడ బయలగు నఖిలంబు బయలుకలిమి,
సుదతి దంతధ్యుతి సొబగు వర్ణించుచో రుచులె మౌక్తికముల రుచులు దడవ?
గీ. ననిన నభనవరామణీయకము మహిమ
యజ్జగంబునఁ బ్రతిలేమి యేమి సెప్ప,
గరుడఖచరోరగామరకన్యలందు
నయ్యుషాకన్య నుపమింప నబల గలదె? (ఆం) 252

చ. ప్రమదవనాంతరంబుల విభాకమనీయములై యశోకము
ల్తమిగొనె నెల్లచోటఁ బ్రియులన్ గృతకప్రణయాపరాధ వి
భ్రమముల నల్గఁ జేసి వెడవాసినపాంథులమీఁది కోపభా
రమున రతీశుకన్నుఁగవ రాలిన నిప్పులప్రోఁకలో యనన్ (ఆం) 253

గీ. ప్రియముఁగూర్చి ముత్తైదువ పేరంటాలు
నలువపట్టంపుదేవి లేనగవు నగుచు
నగసుతాపద్మ లీక్షింప బిగియ ముడిచె
దంపతుల యుత్తరీయ వస్త్రముల తుదలు. (ఆం) 254

గీ. పూని తిమిరారు లందఱు పొడిచిరేని
పంగమగ్న రత్నంబులభాతి నిందు
మినుకు మినుకని యంతన పొనుఁగు వడరె
యనఁబటు ధ్వాంత జృంభణ మగ్గలించె. (ఆం) 255

గీ. పొదలి యొండొండ దివియును భువియు దెసలుఁ
బొదివికొనియెడి చీఁకటి ప్రోవువలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవయంబన జగదండ ఖండ మమరె. (ఆం) 256

చ. పొలుపు వహించి పెన్నురువు ప్రోఁకగతిన్ హరిదంతభాగముల్
గలయఁగఁ బర్వు మంచున దళంబుగ శైత్యముఁ దాల్చు క్రొత్తత
మ్ములచెలికాని నిందుఁడని ముద్దొలుకంగఁ దదీయదీప్తు లు
య్యలలుగఁ దూఁగుఁ బ్రీతి యెసలారఁ జకోరకిశోరసంఘముల్. (ఆం) 257

చ. భువిఁదనివోక వెండియు నభోనదిపొందునకై కళిందసం
భవబహువేణికావిభవబంధురతన్ దివియందుఁ బర్వె నా
నవిరళ లీల నొప్పెసఁగు నప్పురివప్రనిబద్ధశాతమ
న్యవమణిజాయమానసముదగ్రతరాగ్రిమదీప్తిపూరముల్. (ఆం) 258