పుట:Prabandha-Ratnaavali.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 39

ఉ. భారతివై సరోజభవుపాల వసించి రమావధూటివై
నీరజనాభుఁ జెంది ధరణీధరనందనవై మహేశ్వరుం
గోరి వరించితమ్మ! నినుఁ గొల్వక యూరక యేల కల్గు సం
సారసుఖంబు లీ మనుజసంతతికిం దలపోయ నంబికా! (జ) 174

త్రిపురాంతకుఁడు [ఉదాహరణము] (ఇ)

ఉ. పాములు హారముల్ నెలయుఁ బాపటసేసయు నేఱు మల్లికా
దామము తోలు దువ్వలువు దట్టపుబూదియుఁ జందనంబు మై
సామునఁ జాల నందముగ సన్నిధి సేసిన జాడఁగంటి నే
నా మదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాసనాథునిన్. (జ) 175

త్రిపురాంతకుఁడు [తారావళి] (జ)

మ. అమితధ్వాంత తమాలవల్లిలవనవ్యాపారపారీణ దా
త్రమొ సౌగంధికషండకుట్మలకుటీరాజీసముద్ఘాటన
క్రమనిర్వాహధురీణకుంచికయొ నాఁగం బెంపున న్నీ కళా
రమణీయత్వము చూడ నొప్పెసఁగుఁ జంద్రా! రోహిణీ వల్లభా! (జ) 176

మ. చరమక్ష్మాధర చారుసింహముఖదంష్ట్రాకోటియో నాఁగ నం
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేఖప్రస్ఫురద్గర్వసం
హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!

మ. పొలకయ్యంబులఁ గల్గు ముద్దుటలుకన్ బుష్పాయుధారాతి మ్రొ
క్కులఁ దీర్పన్ దలమీఁదఁ గాన నగు నీ క్రొమ్మేను పుణ్యాంగనా
తిలకంబైన భవాని పాదనఖపంక్తిం జెంద డెందంబులో
దలఁతా చుక్కలతోడి మక్కువలు చంద్రా! రోహిణీ వల్లభా! (జ) 177

మ. రతినాథుం డను మాయజోగి చదలం ద్రైలోక్యవశ్యాంజనం
బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయంబై యున్న పాత్రంబునన్
మతకం బేర్పడఁ బెట్టి దాఁచెనన మీ మధ్యంబునన్ మచ్చ సం
తతమున్ గన్నులపండువై వెలయుఁ జంద్రా! రోహిణీవల్లభా! (జ) 178