పుట:Prabandha-Ratnaavali.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38 ప్రబంధరత్నావళి

గీ. శారదాదేవి, సావిత్రి, శ్రద్ధ, తుష్టి,
మతియుఁ, గుశసూత్రకాంచిదామములు వెట్ట
నెమ్మిఁ గొలువంగ దర్భాసనమ్ముమీఁదఁ
జూడ నొప్పెఁ బితామహసోమయాజి. (ఆం) 169

ఉ. సహ్యముఁ గాంచె వాణి వనసైరిభ సామజ సింహ గండకా
సహ్యము సిద్ధసాధ్యసురచారణకిన్నర సన్మునీశ్వర
గ్రాహ్యము శృంగసంశ్రిత కిరాతవధూశ్రుదివ్యయోషి దై
తిహ్యము నగ్రభూసుఖితతిగ్మమయూఖ రథౌపవాహ్యమున్. (ఆం) 170

తిమ్మయ, కుంటముక్కల [శైవాచారసంగ్రహము] (ఆం)

సీ. కపిలవర్ణముగోవు కడునొప్పు నంద నా జనియించెఁ దద్గర్భమున విభూతి,
నల్లనిమొదవు వర్ణన కెక్కు భద్ర నాఁ దద్గర్భమున భసితంబు వుట్టె,
నెఱ్ఱనిధేనువు నేపారు సురభి నాఁ గలిగె భస్మంబు తద్గర్భమునను,
పొగ[డ]చాయ గలయావు పొలుచు సుశీల నా క్షారంబు గలిగెఁ దద్గర్భసరణిఁ
గీ. జిత్రతరవర్ణరుచులు ప్రసిద్ధిఁ దాల్చు
గిడ్డి సుమనోభిధాన మంగీకరించుఁ
బ్రభవ మొందెఁ దదీయగర్భమున రక్ష
పంచముఖముల నిట్లుద్భవించె భూతి. (ఆం) 171

త్రిపురాంతకుఁడు, రావిపాటి [అంబికాశతకము] (ఇ)

ఉ. ఆదిమశక్తి యీ తరుణి యాద్యకుటుంబిని యీ కుమారి ము
త్తైదువ యీ తలోదరి చిదాత్మక యీ సతి విశ్వమాత యీ
పైదలి సర్వలోకగురు భామిని యీ చపలాక్షి యంచు బ్ర
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు రంబికా! (ఆం) 172

ఉ. కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకటఁ బ్రోవుగ బొడ్డుపై వళుల్
జాడగఁ దోఁపఁ గ్రొమ్మొలకచన్నులు మించు దలిర్ప సిగ్గునన్
జూడఁగ నేరముల్ మెఱుఁగుఁ జూపుల నీన హిమాద్రి యింట నీ
వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా! (ఆం) 173