పుట:Prabandha-Ratnaavali.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 ప్రబంధరత్నావళి

శా. గీర్వాణాచలసాను వాత్మరదనక్రీడాహతంబైన న
య్యుర్వీరంధ్రమునం దనంతఫణరత్నోద్యత్ప్రభ ల్పర్వి దృ
క్పర్వంబై పొదిఁగట్టి పేర్చిన మదిం గంజంబ యంచున్ కన
ద్గర్వోన్మీలితనేత్రుఁడై మెఱయు వేదండాననుం గొల్చెదన్. (ఆం) 159

చ. తరుణుల వీగుఁ జన్నుఁగవ తాఁకున మన్మథచక్రవాక బం
ధురగతి లీలఁ గామినుల తోరపుటూరుల ఘట్టనంబులన్
కరివరహస్తకాండపటుఘట్టనలన్ బరిఖాతరంగముల్
దిరుగుడు వడ్డ తీరముల దెట్టువు గట్టు సరోజరేణువుల్.[1] (జ) 160

సీ. పద్మంబులును వప్రపద్మరాగ ప్రతి బింబములును తగ బెరసి మెఱయఁ
గల్లోలములును రంగన్మకరాయిత తుండములను నటు తొట్రు పడఁగ
బిసములు విహరణరససమాగత రసా తల నాగశిశువులు చెలిమి సేయఁ
జక్రయుగ్మంబులు జలకేళిలోల ని తంబినీస్తనములు తఁడబడంగ
ఆ. సొంపు మీఱినట్టి పెంపును గంభీర
తయును బరపు [బోవు] వేడ్క దగిలి జనులు
సంస్తుతింప నఖిలసన్నివేశస్థితి
నప్పురంబు పరిఖ యతిశయిల్లు. (జ) 161

క. పరధన పరాంగనాజన
పరిహారము పరమధర్మపథ మందురు స
త్పురుషులు మఱవక వీనిం
బరికింపుము వినకు మెపుడు పైశున్యంబుల్. (జ) 162

సీ. మదనవశీకారమంత్ర దేవత దృష్టి గోచరమూర్తిఁ గైకొనియె నొక్కొ?
సితకరబింబ నిస్సృతసుధాధార ని తంబినీరూపంబుఁ దాల్చె నొక్కొ?
విధికామినీ సృష్టివిజ్ఞాన పరసీమ భాసురతనులీలఁ బడసె నొక్కొ?
శృంగారనవరస శ్రీవిలాసోన్నతి సుందరాకారంబు నొందె నొక్కొ?
ఆ. కాక యొక వధూటి కడుపునఁ బుట్టిన
భామ కేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచుఁ గన్నియపై మహీ
పాలసుతుఁడు దృష్టి పఱపె నర్థి. (జ) 163

  1. చూ. నిర్వచనోత్తరరామాయణము