పుట:Prabandha-Ratnaavali.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 35

శా. సారాచారవిచారు నుత్తమకులున్ సౌజన్యధన్యున్ గృపా
పారున్ శూరు వికారదూరు ననఘున్ గంభీరు ధీరు న్మహో
దారున్ భవ్యు సమస్తకార్యవిదు నాప్తప్రాప్తు నర్వేంగితా
కారజ్ఞున్ హితు మంత్రిఁ జేసి పతి సౌఖ్యం బందుచుండం దగున్. 153

తిక్కన [విజయసేనము] (ఇ)

సీ. అరిమానసమ్ములు దరికొని యేర్చు నె వ్వని యుజ్జ్వలాకారవైభవంబు?
బుధుల లజ్జానతిఁ బొందునట్లుగఁ జేయు నెవ్వని పాండిత్య మెసక మెసఁగ?
నే వదాన్యులనైన నెవ్వని వితరణం బులు వంది[జనుల] చాపల మొనర్చు?
వనితాజనము మానధనముఁ గోల్పుచ్చు వి చ్చలవిడి నెవ్వాని విలసనంబు?
ఆ. అట్టి విజయసేను నభిరామమూర్తి వి
ద్యానిరూఢమతి వదాన్యవరుఁడు
మధురవిభ్రమైకనిధి యను జగమెల్ల
నతఁడు చిత్రగుణసమగ్రుఁ డగుట. (జ) 154

ఉ. అల్లనఁ దొండ మెత్తి శివునౌఁదల యేటిజలంబు వుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠకము పొంతన యున్న సహస్రనేత్రుపైఁ
జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణ సేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్థికరుండు గావుతన్. (ఆం) 155

శా. ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరీక్షించినన్
దిత్సావ్యగ్రుఁడు గాక వ్రిగహముచో దేశంబుఁ గాలంబు సం
వత్సామగ్ర్యముఁ జూపి శక్యము దెసన్ బ్రారంభియై భూప్రజా
వాత్సల్యార్థమనస్కుఁడైన [పతి] శశ్వచ్ఛ్రీసమేతుం డగున్. (జ) 156

క. కిసలయ కదళీబిస బిం
బ సుధాంశు ప్రాయవస్తుబహువిధరూపో
ల్లసము ముద ముడుప నజుఁ డొక
యసమాకృతిఁ దాల్చె ననఁగ నంగన యొప్పెన్. (జ) 157

చ. కొనియెద మన్న బండరులు కోటుల కమ్ముదు; రమ్మఁబూని తె
చ్చిన సరకెంత పెద్ద వెల సెప్పినఁ గొండ్రు తగంగ నిచ్చి న
చ్చిన వెల తీర్చి లక్ష్మి తమ చెప్పిన యట్టుల చేయుసొంపు పే
ర్కొన గణుతింపరాదు, పురికోమటులం బ్రణుతింప నొప్పదే? (జ) 158