పుట:Prabandha-Ratnaavali.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 ప్రబంధరత్నావళి

క. కులమున బలమునఁ జలమునఁ
నలవునఁ గార్యమున సదృశులగువారలతో
బలిమి యుడిగి సామముగాఁ
దలకొని చేయునది నీతి తత్త్వజ్ఞులకున్. (జ) 147

గీ. దొడ్డముత్తియంబు తోరంపుఁబటికంబు
వెండిగుండు మొల్లవిరులచెండు
రసముగుళిక కప్పురంబున కరుడు నా
సొంపు మిగిలి వేగుఁజుక్క వొడిచె. (ఆం) 148

సీ. బచ్చనయోవరి బంధాలమేల్కట్టు సకినల మంచంబు జమిళిపఱుపు,
నిలువుటద్దము హరినీలపు గద్దియ పటికంపుగిండి పొంబట్టుసురఁటి,
పసిఁడిపావలు వెండిపడిగంబు ముత్యంపు జాలవల్లిక కెంపుసానఱాయి,
పగడంపుదివియకంబము వజ్రముల తట్ట మరకతమయమగు మధువుకుడుక,
ఆ. గరిగె పోఁక యొత్తు బరణి సున్నపుఁ గ్రోవి
కప్పురంపుఁబెట్టె గాజుకోర
తనువు నునుపు గలుగుతడి యొత్తుమడుఁగులు
నాది యైనవాని నలవరించి. (ఆం) 149

చ. ముదిమికి మందు వాక్కలిమి[?] ముంగలిజిహ్వ తపఃఫలంబు స
మ్మదమునివాస మింపుగని మారవికారముప్రోది కామినీ
వదనవిభూషణంబు జనవశ్యము హాస్యరసాబ్ధి లాస్య సం
పద యుదరస్థలంబు మధుపానసుఖంబు జగత్త్రయంబునన్. (ఆం) 150

గీ. వికసితంబైన మోమున వెండికోరఁ
గదిసి మధువొక్కయెత్తున సుదతి కొనిన
మగువమొగ మచ్చునను శశిమండలంబు
చెలువముగఁ జేయఁ బెట్టింపఁ జేర్చినట్లు. (ఆం) 151

ఉ. వెన్నెలరూపుకప్పురపువేలుపువజ్రపుబొమ్మలెల్లఁ దాఁ
బన్నిన నొప్పులెప్ప మనఁ బంకజమధ్యమునందుఁ బొల్చి క్రేఁ
గన్నుల బ్రహ్మఁ జూచి చిలుకం బలికించుచు నున్నవాణి యు
ద్యన్నవశబ్దభావరసతత్త్వము మత్కృతి కిచ్చు నెప్పుడున్[?] (ఆం) 152