పుట:Prabandha-Ratnaavali.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 33

బహుళదంతావళప్రాలంబఘంటికా టంకృతోల్లాసి ఘంటాపదంబు
కమనీయరూపరేఖాకళావిభ్రమ ప్రకటితాబ్జాననా రత్నపేటి
గీ. సహజ ధర్మార్థకామమోక్షప్రసిద్ధి
సన్నుతౌదార్యఖేలనాజన్మభూమి
సకలసంపద్విలాసవిస్తారహసిత
రాజరాజపురంబు వారణపురంబు. (ఆం) 143

చౌడయ్య, గంగరాజు [సాముద్రికశాస్త్రము] (జ)

క. ఉదరంబు దర్దురోదర
సదృశంబై జఘన మతివిశాలం బయినన్
సుదతీరత్నంబున క
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుఁడు పుట్టున్. (జ) 144

క. కడు నిడుదయుఁ గడు గుఱుచయుఁ
గడు వలుదయుఁ గడుఁ గృశంబుఁ గడు నల్లనిదిన్
గడు నెఱ్ఱనిదగు మెయి గల
పడఁతిని గీడనిరి మునులు వరమునిచరితా. (జ) 145

చౌడయ్య, గంగరాజు [నందనచరిత్ర] (ఇ)

సీ. కురులు వ్రాయుటయును గొదమ తుమ్మెదలయ్యెఁ గన్నులు వ్రాయంగఁ గలువలయ్యె
నధరంబు వ్రాసిన మధురబింబంబయ్యె గళము వ్రాయుటయును గంబువయ్యెఁ
జనుఁగవ వ్రాసినఁ జక్రవాకములయ్యెఁ జేతులు వ్రాసినఁ జిగురు లయ్యె
నడుము వ్రాయుటయును నవలతయై యొప్పెఁ బొలుపారఁ గటి వ్రాయఁ బులినమయ్యెఁ
గీ. దరుణి తొడలు పాదతలములు వ్రాసినఁ
గరికరములు హల్లకములు నయ్యె
నేమి వ్రాయఁదలఁచి యేమి వ్రాసితినని
మదనవిభ్రమమున మనుజవిభుఁడు. (జ) 146
[1]

  1. “ఒకటి కొకటి యాప నుండ” - చూ. అన్నమాచార్యుని శృంగారసంకీర్తనము (15-70)