Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏ మాటకామాట చెప్పుకోవాలి. వీళ్ళందరిలోకి నామినిదే ముందుదారి. చిత్తూరు పలుకుబళ్ళు కురిపిస్తూనే ఆయన పిల్లందరికీ పప్పుబెల్లాలు పెట్టినట్టే కథలు పంచి పెడతాడు. స్వయంగా స్కూళ్ళకెళ్ళి పిల్లల్లో కూచుని, చెప్పి, చదివి, చదివించి కథలోని ప్రతి ఆయువుపట్టూ అందించే మనిషి గాబట్టి ఇతర జిల్లాల పిల్లలకి అంతుబట్టనంత మాండలికంలోకి ఆయన పోడు. అట్లని చిత్తూరు తెలుగును ఒదిలిపెట్టడు. బమ్మిడి ఉద్దేశపూర్వకంగానే ఉత్తరాంధ్ర గ్రామీణ భాషకు పట్టం గట్టాలనుకొన్నట్టుంది.

"బారిగాడికి బారికి దడ్డూ వదిలేసింది. సభోరికి నాపా వదిలేసింది. నాయిరాలకి తెడ్డూ వదిలేసింది. నాయుడోళ్ళ కోడళ్ళకి సుమ్మలూ రాలిపోనాయి. గండేటి నీలూ ఎప్పుడులాగా బాగయి, తేటయి పోనాయి.....

“ఎళ్తే.... ముందు ఒక పట్ట పరిగి పడ్డాదట. అది తీసి తిర్రి లేసిదాట. రెండోదపా రెయ్యికోస పడాడరట. ఈ పిత్త పరిగి జిల్లేసి ఆరెయ్యి కోస ఉంచిందాట. ఆ తరువాత మిట్ట పడ్డాపదట. ఆ మిట్ట పిల్ల తీసి జిల్లేసి... ఆ మూరుపుని తిరి లేసిందాట. అలాగ అది జల్లేసింది. ఇది జల్లేసింది. అలాగ ఒక పడవ పడ్డాదట... యింత వలం సవడపిల్ల....”

ఇలాంటి పుంఖానుపుంఖ వాక్యాలు మన బోంట్లనే తికమక పెట్టేస్తాయి.

ఇది మంచిదా చెడ్డదా? ఈ ప్రస్తావనతో పని లేదు. తెలుగోళ్ళందరిదీ ఒకే తెలుగేమిటి? ఉత్తరాంధ్ర పిల్లలకు సొంతకతలు అవసరం లేదేమిటి?

హరికిషన్‌ది మాత్రం రాయలసీమ భాషయినా అక్కడక్కడా పదజాలంతప్ప ఒకటి రెండు విరుపులు తప్ప మన పేపరు భాషే. కథల్లో కవిత్వాలు ఒలపోసిన వాళ్ళు నామినీ బమ్మిడీ మరీని. కథను వాళ్ళంత సాదాసీదాగా కంచికి పంపరు. సాహిత్యానికుండాల్సిన సకల మర్యాదలతోటి పంపుతారు.

ఈ తీరు కథనంలో కొన్ని చమత్కారాలు - పిల్లలకి ప్రత్యేకమైన చమత్కారాలు మనం చూడొచ్చు.

ఇందులోని ఒక చమత్కారం ఏమంటే -

కథ మొత్తం ఒకటి రెండు వాక్యాలు ప్రధానంగా మాటిమాటికీ వచ్చేలా సాగుతుంటుంది. కథ సాగేకొద్దీ ఈ వాక్యాలకి కొత్త వాక్యాలు చేరుతూ ఉంటాయి. చెప్పినదాన్నే మాటిమాటికీ చెప్పడం దానివెంటే కథ నడపడం మన ముసలమ్మలు చెప్పే కథల్లోని ఒక జీవకళా రహస్యం. ఇది వినడానికెంత తియ్యగా తమాషా గా ఉంటుందో చదవడానికంత సులువుగా, ముచ్చటగా ఉంటుంది. నామినీ బొమ్మిడీ ఇద్దరూ ఈ కళను అద్భుతంగా పట్టుకొన్నారు.

“వేటగాడా వేటగాడా? నా ముక్కులో ముల్లిరిగితే మంగలాయన తియ్యనన్నాడు. ఆ మంగలాయనకు మేర గింజలు ఎగరేయమంటే రెడ్డి ఎగరెయ్యనన్నాడు. ఆ రెడ్డి వరి మడిని తొక్కమంటే కొంగలు తొక్కమన్నాయి. ఆ కొంగల్ని నువ్వు వలేసిపట్టెయ్" అంటూ సాగుతుంది నామిని గువ్వకత.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 98