రాక్షసులను మనుషులు జయించటమూ, ధనికులను వాళ్ళ సేవకు భంగపరచటమూ, అతి సామాన్యమైన వ్యక్తులలో అసాధారణ శక్తులుండటమూ లేదా వారికవి లభ్యం కావటమూ ఇలాంటి ఇతివృత్తాలు గల జానపద కథలు ప్రపంచమంతటా ఉన్నాయి. వాస్తవ సంప్రదాయాలకు ఎదురువెళ్లే ఈ కథలు చదవటం వల్ల కూడా పిల్లలకు కొంత లాభం ఉన్నది. ముఖ్యంగా చిన్న పిల్లలకు దొంగల భయమూ, దయ్యాల భయమూ లాంటివి అతి తేలికగా అబ్బుతాయి. ఆ భయాలను తగ్గించే దొంగల కథలూ, దయ్యాల కథలూ పిల్లలు చదివి ఉండటం మంచిది.
దేవుడి మీద భక్తినీ, మత విశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిదికాదు. కథల్లో దేవతలూ, భక్తులూ ఉండరాదని కాదు. దేవుణ్ణి నమ్ముకొంటే అన్ని సుఖాలూ ఒనగూడతాయన్న అభిప్రాయాన్ని పెద్దలు కలిగి ఉండటం ఎంత తప్పో, పిల్లలకు యివ్వటం అంతకు పదింతలు తప్పు. కథలో నెగ్గవలసినది మనుష్యయత్నము, మనిషి సద్బుద్దీనూ. ఇది చాలా ముఖ్యం.
రచనా విధానం
బాలసాహిత్య రాసేటప్పుడు కథనం పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడుతున్నట్టుండా లనుకోవడం నా బుద్ధికి చాదస్తంగా కనిపిస్తుంది. 'అప్పుడేమయిందను కొన్నారూ?' 'రాజుకో కూతురుందనుకొన్నాం కాదూ?... చూశారా, వాడి దుర్మార్గం వాణ్ణి ఏస్థితిలోకి తెచ్చిందో?' ఇలా అడుగడుగునా బాల పాఠకులను తట్టుతూ వుండటం అనవసరం అనుకొంటాను.
రచనలో వ్యర్ధపదాలూ, ప్రకృతి వర్ణనలూ, సౌందర్య వర్ణనలూ పిల్లలను అంతగా ఆకట్టవు. 'కీకారణ్యం', కటికచీకటి', 'పండువెన్నెల', 'పెద్ద కెరటాలతో ఉప్పెన' ఇలాంటి మాటలతో వాళ్ళు ఎంతైనా ఊహించుకోగలరు.
పాత్రలు చాలా మంచివాళ్ళయినా కావాలి. చాలా చెడ్డవాళ్ళయినా కావాలి. చాలా తెలివిగల వాళ్ళయినా కావాలి. వట్టి మూర్ఖులైనా కావాలి. చాలా అందంగానైనా ఉండాలి. వికారంగానైనా ఉండాలి. ఓ మాదిరి మంచీ, సుమారైన తెలివీ, ఎటూగాని అందమూ బాల సాహిత్యానికి అనవసరం. పాత్రల అంతస్సంఘర్షణలు కూడా అంతే.
పిల్లల కోసం రాయటం ఒక గొప్ప కళ. తెలుగులో ఆ కళను చెప్పుకోదగినంతగా వృద్ధి చేసిన వారెవరూ ఉన్నట్టు కనబడదు. కొందరు పాత్రోచిత భాష ప్రవేశపెట్టాలని హీన పాత్రల చేత యాసగా మాట్లాడించటం లాంటి ప్రయోగాలు చేస్తారు. నా దృష్టిలో ఇది గూడా ఈనాటికీ పొరపాటే. కథల్లో సంభాషణలు ఉండక తప్పదు. కాని వాటిలో అంత వాస్తవికత నిరుపయోగం.
బాలగేయాలు, ఇతర రచనలు
అదృష్టవశాత్తూ ఈనాడు మనలో చక్కని బాల గేయాలు రాసేవారున్నారు. నిజానికి పెద్దవాళ్ళకన్నా పిల్లలు గేయాలను ఎక్కువగా ఆనందించగలరు. బాలగేయ రచనలు పిల్లలకు ఎంతగా అందుతున్నాయో నాకు తెలీదు. కొన్నిటికి బహుమతులు కూడా లభించాయనుకొంటాను.
పిల్లలకు విజ్ఞానం కూడా కొంతవరకూ అవసరమే. ఈ స్నుత్నిక్ - హైడ్రోజన్ బాంబు యుగంలో వాళ్ళు తెలుసుకోదగిన వైజ్ఞానిక విషయాలు ఎన్నో ఉన్నాయి.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 94