పిల్లలు చదివే పుస్తకాలేవీ, కథలేవీ?
మన దేశంలో బాలసాహిత్యమంటూ ఇప్పు డిప్పుడే వస్తున్నది. బెంగాలీ, హిందీ మొదలైన భాషలలో రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం కూడా బాల పత్రిక లుండినట్టు తెలుస్తోంది. తెలుగులో మాత్రం బాల పత్రికలు స్వాతంత్ర్యం వచ్చే రోజుల్లోనే బయలుదేరాయి.
నా చిన్నతనంలో బాలసాహిత్యమంటూ వేరే లేదు. నాకు చదవటమూ, రాయటమూ రాగానే సుమతీ శతకం కంఠస్థం చెయ్యమన్నారు. వావిలకొలను వారు రచించిన పాకెట్‌సైజ్ కథల పుస్తకాలేవో ఉండేవి. భాగవతం నుంచి కుచేలోపాఖ్యానం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం లాంటి కథలు చదివాను. వాటిలోని కొన్ని పద్యాలు నాకిప్పటి కింకా జ్ఞాపకం ఉన్నాయి.
అర్ధ శతాబ్దం క్రితం ఇదే బాల సాహిత్యం. నిజాని కిది పిల్లల కోసం ప్రత్యేకించి రాసిన సాహిత్యం కాదు. పెద్దల సాహిత్యమే. పెద్దల సాహిత్యంలో పిల్లలకు పనికి వచ్చేదంతా పిల్లల సాహిత్యంగా చలామణీ కావటం మన సంప్రదాయం. మనం ఈరోజు బాల సాహిత్యం గురించి పాశ్చాత్యుల అభిప్రాయాలు అరువు తెచ్చుకొని లాభం లేదు.
ఇంచుమించు ఇరవై ఏళ్ళుగా సాహిత్యంలో నాకు గల సంబంధాన్ని బట్టి బాలసాహిత్యం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న అభిప్రాయాలు కొన్ని ఏర్పరచు కొన్నాను. కొంత కాలమయ్యాక వాటికి కాలదోషం పట్టవచ్చు. ప్రస్తుతానికి ఈనా అభిప్రాయలు సముచితమైనవని భావించి వాటిని ఇక్కడ చెబుతున్నాను.
పశు పక్ష్యాధులు పాత్రలుగా గల నీతి కథలూ, దేవతలూ, రాక్షసులూ, మాంత్రికులూ, అతీంద్రియ శక్తులూ మొదలైన వాటితో కూడిన దేవతా కథలూ గడిచి పోయిన యుగాలకూ, సమాజానికీ సంబంధించిన జానపద కథలూ బాల సాహిత్యంలో ప్రముఖ స్థానం కలిగి ఉంటాయి.
వాస్తవికత
పైన చెప్పిన కథలలో వాస్తవికతకు చోటు లేదు. “బుల్లి చేపల చేత మాట్లాడించటంలోనే ఉన్నది చిక్కంతా!" అన్నాడట ఆలివర్ గోల్డ్ స్మిత్. చేపలు, కాకులూ, ఎలుకలూ మాట్లాడటం వల్ల వాస్తవికత పోతుందని అతడు భయపడి ఉంటాడు. కాని బాలసాహిత్యంలో అలాంటి వాస్తవికత అనవసరం. పిల్లలు తాము వినే (చదివే) కథలలోని సన్నివేశాలనూ, సంఘటనలనూ తమపరంగా అన్వయించుకోనవసరం లేదు. వాళ్ళు వాటికి ఎడంగా ఉండే ఆనందం పొందాలి.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 92