Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలకూ హృదయం ఉంది, దానికో భాష ఉంది

'మావాడు వసపోసిన పిట్టలా ఒకటే వాగుతుంటాడు.

'నీకు ఒక్కక్షణం నోరు మూతపడదు గదరా. '

'ఈ పిల్లల గోలతో వేగలేక ఛస్తున్నాను. ఒక్కమాట చెవిలో దూరనిస్తేనా?

ఇలా మనం అంటుంటాం. వింటుంటాం.

బొమ్మతో ఆడుకొనే సీతను చూడండి. తానొక్కతే ఉన్నా ఆ బొమ్మతోనే, 'లాల పోస్తాను. గౌను వేస్తాను. మనం రేపు ఊరి కెళుతున్నాం. నువ్వూ రావొద్దూ,' ఇలా తలాతోకాలేని సంభాషణ చేస్తూ ఉంటుంది.

గోడ కానుకొని కాళ్ళు చాచుకొని కాగితాలు చించి ఏదో చేస్తున్న రాముని చూడండి. వాడిలో వాడే గొణుగుతున్నాడు. రాగాలు తీస్తున్నాడు. ఒకదానికొకటి పొంతన లేని వాక్యాలు గుప్పిస్తున్నాడు. వాడి లోకంలో వాడున్నాడు.

సత్యంగాడంటే వాళ్ళక్కయ్యకీ బావకీ, అందరికీ హడల్. దేనికంటారా? వాడు అందరు పిల్లల్లా కథ చెప్పమని అడగడు. నేను కథ చెపుతా అంటూ లంకించుకొంటాడు. ఎంత విన్నా ఆ కథ పూర్తికాదే. వాడేమో తన్మయంతో చెపుతుంటాడు. ఒక్క ముక్కా అర్థంగాక, ఇంటిల్లిపాదీ సతమతం.

ఇక రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణాల్లో చెప్పేదేముంది? ఎక్కడెక్కడి ప్రశ్నలో అడుగుతారు. జవాబు చెపితే మళ్ళీ ప్రశ్న. మళ్ళీ మళ్ళీ ప్రశ్న. మనం వెతుక్కొనే దొకే పరిష్కారం. ‘ఛ నోర్ముయ్' అనడం. అంతేనా మన ? పిల్ల అంత 'అనాగరీకంగా' వాగుతుంటే, ప్రయాణీకులందర్నీ ‘డిస్టర్బు' చేస్తుంటే, వాళ్ళంతా 'వీళ్ళ పెంపకం ఇలా ఉంది,' అన్నట్టు చూస్తుంటే మన తల తీసేసినట్టుండదూ! ఎప్పుడెప్పుడు దిగిపోదామా అన్పిస్తుండదూ!

స్వగతాలకీ అర్థం ఉంది

ఇలా పిల్లలెందుకు మాట్లాడుతారు? వాళ్ళ స్వగతాలకి అర్థం, పరమార్థం ఏమైనా ఉంటాయా? 'వైగోట్స్కీ' మాటల్లో చెప్పాలంటే 'పిల్లల ఇలాంటి స్వగతాలకెంతో అర్థం వుంది. తాము చేస్తున్న పనుల్ని ఈ స్వగతాలు క్రమబద్దీకరిస్తాయి. ఆర్గనైజ్ చేస్తాయి. మానవ అభ్యసనంలో, ఎదుగుదలలో ఇదో ప్రధాన ఘట్టం. ఇంకా చెప్పాలంటే పిల్లల ఈ మాటల్నించే వాళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. ఆలోచనలకి మాటలు వ్యక్తీకరణలేగానీ, మాటలు ఆలోచనలకి ఎలా ప్రాతిపదికలు'?

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 9