Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలా రాయడం ఏమంత కష్టం అనుకొంటే పొరపాటే. భాష మీద పట్టు ఉన్నవారే అలా రాయగలరు. అలా రాయడమే అసలైన గొప్పతనం. కాళిదాసు కవిత్వంలో ఇలాంటి వాక్యాలే ఉంటాయి. కాదంబరి ధారాళంగా మహాప్రవాహంలా సాగేపుడు బాణుడు ఇలాంటి పొట్టి పొట్టి వాక్యాలే గుప్పిస్తాడు. అసలు మనం ఇలాంటి వాక్యాల్నే మాట్లాడతాం. అందువల్లనే ఆ వేగం!

ఇల చూసినపుడు ‘మనం ఏ తరగతి పిల్లల కోసం ఈ కథ రాస్తున్నాం' అని రచయిత గుర్తుంచుకొని రాస్తే మంచి కథలు వస్తాయి. దురదృష్టవశాత్తు అలా మన కథలు ఉండటం లేదు. 5-6కాదు గదూ 10-12 పదాల వాక్యాలు కూడా మన కథల్లో ఉంటున్నై. (కథల్లో ఏమిటి పాఠ్య పుస్తకాల్లో మాత్రం లేవా?) అవి కూడా డొంక తిరుగుడు సంక్లిష్ట వాక్యాలుంటున్నై. మనం ఎప్పుడూ అలా మాట్లాడుకోం. పిల్లలైతే మరీ సూటిగా పొడిపొడి పదాలతో మాట్లాడుకొంటారు.

మన పిల్లల కథలు గ్రేడింగు పద్ధతిలో 2-3, 4-5, 6-7, 8-9-10 తరగతులకు వేర్వేరుగా ఉంటే ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ పద్ధతి లేనందువ్ల బాగా నష్టపోతున్నది మన 2-3, 4-5 తరగతుల స్థాయి పిల్లలే.

కథలు చదవడం వల్ల పిల్లలకి భాషాజ్ఞానం అబ్బుతుందనుకొన్నాం గదా! మరి ఏ భాషాజ్ఞానం? కొత్త పదాలు, పర్యాయ పదాలు నేర్చుకోవడం వల్ల భాష మరింత పరిపుష్టం గావడం కథల ప్రధానోద్దేశమై ఉండాలా? నక్క కథ చెపుతుంటే జంబూకం, సృగాలం, గోమాయువు ఇలా ఒక్కోసారి ఒక్కో పేరు వాడితే ఎలా ఉంటుంది అనే చర్చా ఉంది.

మొదటి దశలో కావాల్సింది ధారాళంగా చదవ గల్గడం. వాక్యంలో పదాలకున్న స్థానాన్ని గుర్తించి, సమన్వయం చేసుకోగల్గడం. మాటాడే వాక్యాల్ని అక్షరాల్లో పట్టుకోగల్గడం. విషయ సారాన్ని అందు కోగల్గడం.

అంతే తప్ప ఇనప గుగ్గిళ్ళ పదాలిన మింగడం గాదు. పుస్తకమంటే భయమో, ఏవగింపో, వికృతమనే భావనను కల్గించడం గాదు అది 'మనది' అన్పించడమే పిల్లల కథలో అసలు రహస్యం. చిన్నపిల్లల కథల్లో ఇది మరింత వాస్తవం.

ఇప్పుడు చెప్పండి మన పిల్లల కథా పుస్తకాలిలా ఉన్నాయా?


- సి.వి. కృష్ణయ్య


పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 89