కథ మనిషితో పుట్టింది. నాటికీ, నేటికీ మనిషి ఆస్తి. ఇంటింటా ఒక కథ. దేశదేశానికి కథలు తరతరాలకు కథలు. కొన్ని చెప్పిన కథలు, మరికొన్ని వ్రాసిన కథలు. లోకం కథల లతల పందిరి.
ఇహ పెద్దలంటారా - ఒక విషయాన్ని గమనించడం మానేశారు. కథలు చెప్పడం మనిషికే కాదు మజా. సృష్టికర్తకు కూడా కథలు కట్టడమంటే మజా. అతను కథలు కట్టడం మానుకున్నప్పుడే మనుషులూ మానుకుంటారు.
అనగా.... అనగా.... ఓ రోజున సృష్టికర్త తన కార్ఖానాలో కూచున్నాడు. అప్పుడు ఈ సృష్టి ఈ రూపంలో లేదు. ఒక పొగ ముద్దగా ఉన్నది. సృష్టికర్త ఆ ముద్దనుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించడం మొదలెట్టాడు. పొగమబ్బులా ఆవ్యక్తంగా ఉన్న ప్రపంచాన్ని ఒక రూపం కల్పించడానికి మూలధాతువు లన్నిటిని చేతిలో పుచ్చుకున్నాడు. గాలినీ వెలుగునూ పిలిచాడు.
రంగు రంగుల ప్రపంచాన్ని సృష్టించసాగాడు. ఆనాటి తొలిసృష్టిని రూపొందించిన భగవంతుడూ ఒక పసిబిడ్డేనని గ్రహించగల వారెందరుంటారు? కట్టు కథ వినడం బిడ్డకి సరదా. అలాగే లోకాన్ని సృజించడం ఈశ్వరుని ఒక సరదా. రంగు రంగుల సృష్టి మెల్లగా సాగింది. తళతళల జీవితం తొలి ప్రొద్దులా మేలుకున్నది. పచ్చని గడ్డి, చెట్టు చేమలు బయలుదేరాయి. కిలకిలలాడే పక్షులు, సింహాలు, పులులు, జంతువులూ జన్మించాయి. మిలమిల లాడుతూ చిరుచేపలు జన్మించాయి. కొన్ని జంతువులు పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. మరికొన్ని అడవులు చేరి నెలవులు ఏర్పరుచుకున్నాయి. మరికొన్ని నీటి అడుగున నివాసం ఏర్పరచుకున్నాయి.
కాలం పరుగుతీసింది. యుగాలు గడిచాయి. కడకు ఒకనాడు సృష్టికర్త మనస్సులో ఒక కొత్త ఊహ తళుక్కుమన్నది.
మానవుడు అవతరించాడు. మానవుని సృష్టించక మునుపు సృష్టికర్త కొంత శాస్త్రజ్ఞుడు, కొంత శిల్పి. కాని మానవుని సృష్టించిన తరువాత సృష్టికర్త కల్పనామూర్తిగా రూపొందాడు. తానే కథకుడయ్యాడు.
మానవాత్మ కథలా వికసింపసాగింది. జంతువులకు తినడం, నిద్రించడం, సంతానాన్ని సాకడం పనులు. కాని మానవత్మ అలా కాదు. మానవ జీవితం అలా కాదు. మానవ జీవితం ఒక మహావాహిని. అనేక కథా ఘట్టాల ద్వారా, అనంత సంఘర్షణల ద్వారా, ఉద్వేగాల ద్వారా, సుళ్ళు తిరుగుతూ సాగిపోయే మహావాహిని. వ్యక్తికీ సంఘానికి సంఘర్షణ. రక్తికీ విరక్తికీ సంఘర్షణ. జలవాహిని వలెనే మానవుడు కథావాహిని. మనిషి మనిషిని కలిసినప్పుడు తప్పనిసరిగా అడిగే ప్రశ్న. ఏమిటి విశేషాలు? ఓహెూ అలాగా? ఆ... ఆ తరువాత ఏం జరిగింది. ఇలా పరస్పరం ప్రశ్నించుకున్న ప్రశ్నల సమాధానాలే మల్లె పందిరిలా విశ్వమంతా వ్యాపించాయి. ఇదే జీవన కథ. ఇదే మానవకథ.
చరిత్ర, కథా కల్పన కలిసి నెయ్యం చేసుకొని లోకాన్ని రూపొందిస్తాయి. ఒక్క అశోకుడూ, అక్బరూ మాత్రమే నిజాలు కాదు. వారెంత నిజాలో మణి కోసం ఏడు సముద్రాలు దాటిన రాజకుమారుడు కూడా అంతే నిజం. చరిత్ర వలెనే కథ సైతం నిత్య సత్యం. ఏది నిజం అనేది కాదు ముఖ్యం. ఏది మనోజ్ఞమన్నది అంతకన్న ముఖ్యం.
మానవుడు ఒక శిల్పఖండం. ఈశ్వరుడు మానవుని శిల్పించడంలో అతని యాంత్రిక నైతిక ప్రవృత్తుల కన్న అతని భావనాత్మకు హెచ్చు ప్రాధాన్యం ఇచ్చాడు. ఎవరు ఎంత కప్పిపుచ్చినా దాగని సత్యం ఇది. నిజం నిప్పు వంటిది.
బడిపంతుళ్ళూ, శుష్క పండితులూ ఈ నిజాన్ని కప్పి పెట్టడానికి ఎంతైనా ప్రయత్నించ వచ్చు. ఇలకూ, కలకూ రాజీ కుదర్చడానికి తాపత్రయపడవచ్చు. కాని వారి యత్నాలు వృధా.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 82