Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రం వాటిలో దాగి ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడ్డం కోసం ప్రయత్నిస్తున్నారన్న మాట. మాటాడ్డం నేర్చు కొంటున్నారన్న మాట.

ఒక కృత్యాన్నీ, ఆ కృత్యం చెయ్యడంలోని నైపుణ్యాన్ని మనం విడదీసి చూడలేం. అలాగే పిల్లలు కూడా భాషా నైపుణ్యాల్ని నేర్చుకొని తర్వాత భాష నేర్చుకోరు. మాట్లాడుతూనే వాళ్ళు మాట్లాడ్డం నేర్చుకొంటారు.

మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వల్ల కొన్ని చర్యలు జరుగుతుండటం పిల్లలు గమనిస్తుంటారు. ఈ మాటలకీ చర్యలకీ సంబంధం ఏమిటో వాళ్ళకి తెలీదు. కానీ తామూ ఆ మాటల్లో భాగస్వాములు కావాలని పిల్లలకి కోరిక. తమ మాటల (ధ్వనుల) వల్లా ఇలా చర్యలు జరగాలని వాళ్ళ పట్టుదల. కానీ తమ మాటలకి అలాంటి శక్తి లేదని 1-1½ సంవత్సరం వయసు పిల్లలకి అర్థమైపోతుంది. తాము ఇస్తున్న సమాచారం అవతలి వ్యక్తికి అందడం లేదని తాము చాలా పనులు చెయ్యలేనట్టే మాట్లాడ్డం కూడా చెయ్యలేకపోతున్నామని రెండేళ్ళ పిల్లలు బాగా గుర్తించేస్తారు. మరోవైపు వాళ్ళ 'అవసరాలు' పెరుగుతుంటాయి. వాటన్నిటినీ వ్యక్తం చేసుకోవాలి. మాటలు తప్పనిసరి అవుతాయి.

ఓ కొత్త శబ్దం పలకాలంటే, గుర్తుంచుకోవాలంటే ఎంత కష్టమో మనం విదేశీ భాష నేర్చుకొనేప్పుడు చూస్తున్నాం. మన పెదాలు, నాలుక, దవడలు, గొంతు ఇలా స్వర యంత్రమంతా ఈ కొత్త భాష కనుగుణంగా చలించేందుకు నానా అవస్థలు పడతాయి.

కానీ ప్రతి బిడ్డా తన కవసరమైన, తన పరిసరాల్లోని భాషను నేర్చుకొంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు భాషలు కూడా పిల్లలు నేర్చేసుకొంటున్నారు. ఇన్ని ధ్వనుల్ని, శబ్దాల్ని సమన్వయం చేసుకోవడం పెద్దలకే ఇంత కష్టమే, పిల్లలకెలా సాధ్యమవుతోంది?

దీనికొకటే సమాధానం. ఓపిగ్గా ఏమాత్రం విసిగి పోకుండా పట్టుదలగా ప్రయత్నించడం వల్లనే ఇది సాధ్యమవుతోంది. వేల పర్యాయాలు ధ్వనుల్ని, శబ్దాల్ని, పదాల్ని తన చుట్టూ ఉన్నవారి నుంచి విని పోల్చుకొని, తన ధ్వనుల్ని, మాటల్ని ఇతరులకు సన్నిహితం చేసుకొంటూ వాళ్ళు భాష నేర్చుకొంటున్నారు, అన్నిటికన్నా ముఖ్యమైంది ఏమంటే ఎంతో బాగా మాట్లాడాలనుకొనే ప్రయత్నంలో ఎన్నో తప్పులు చేస్తూ చేస్తూ వాళ్ళు నేర్చు కొంటున్నారు.

అలా గాదనుకోండి. మనమే ఈ మాట్లాడ్డం అంతా నేర్పించేందుకు నడుం బిగించామనుకోండి. ఏం జరిగేది?

ఏం జరిగేదో 'బిల్‌హల్' మాటల్లో విందామా?

వెంటనే మనం ఓ నిపుణుల కమిటీ వేసేవాళ్ళం. భాషా నైపుణ్యాల్ని వాళ్ళు విశ్లేషించేవారు. ఎన్నిరకాల నైపుణ్యాలుంటాయో లెక్క తేల్చేవారు. పిల్లలుఏ భాష నేర్చుకోవాలో ఆ భాషా పదాలు నేర్చుకోవాలంటే ముందు ధ్వనులు పలకడం రావాలి కదా! ఆ తర్వాత గదా మాటలు.

ఆ ధ్వనుల్ని మళ్ళీ సులభమైనవి, సర్వసమాన్యమైనవి అని విభజించేవాళ్ళు. అప్పుడు మనం ముందు సులభమైన ఈ ధ్వనులు నేర్పి ఆ తర్వాత కష్టమైనవి, అరుదైనవి నేర్పించే వాళ్ళం.

పిల్లలు గందరగోళ పడిపోయే ప్రమాదంఉంది కాబట్టి ఇతర ధ్వనులేవీ వాళ్ళకి వినబడకుండా చేసేవాళ్ళం. సాధారణ సంభాషణల్ని వింటే బూతుపదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి వీలున్నంత దూరంగా ఉంచేవాళ్ళం. మనం నేర్వదల్చుకొన్న ధ్వనుల్ని మాత్రం బాగా మార్మారు వినబడేలా ఏర్పాట్లు చేసే వాళ్ళం.

ఆ తర్వాత గుణింతాలు అక్షరాల్ని పలకడం నేర్పేవాళ్ళం. అందుకోసం రకరకాల ధ్వనుల్ని కలిపి లిస్టు తయారు చేసుకొనేవాళ్ళం. వాటితో వచ్చే పదాలతో ఆ తర్వాత లిస్టులు తయారుచేసేవాళ్ళం. మరి పదాలు రాగానే సరిపోయిందా? వాటిని కలిపి వాక్యాలు తయారు చెయ్యాలిగా. అందుకోసం వ్యాకరణం ముందు ఎక్కించే వాళ్ళం. హమ్మయ్య వ్యవహారం ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది, అనుకొనితర్వాత పనికి ఉపక్రమించేవాళ్ళం.

ఇంక చేయాల్సిందంతా డ్రిల్లింగు, అప్పుడప్పుడూ సమీక్షలు, మరిచిపొయ్యారో ఏమో తెలుసుకొనేందుకు వీలున్నన్ని సార్లు పరీక్షలు.

ఆహా! ఇప్పుడేమవుతుంది? ఏమయ్యేదేముంది తొంభై శాతం పిల్లలు ఈ గొడవ పడలేక, అడుగడుగునా వణికిపోలేక పారిపోతారు. (పారిపోయి ఎంచక్కా వాళ్ళింట్లో, పరిసరాల్లో, ఆటల్లో, పనుల్లో మాట్లాడ్డం వింటారు. హాయిగా ధారాళంగా మాట్లాడ్డం నేర్చేసుకొంటారు) లేకుంటే మూగమొద్దుల్లా తయారవుతారు.

ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఎలా నేర్చుకొం టారు? మనమెలా నేర్పాలనుకొంటున్నాం?

జాన్ హాల్ట్ 'హౌ చిల్డ్రన్ లెర్న్' ఆధారంగా

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?◆ 8