కథ లెక్కడ దొరుకుతాయి?
సాంప్రదాయిక కథలంటే ఏమిటి? వీటి ప్రాధాన్యత ఏమిటి? దీన్ని మనం పరిశీలించాలి. ఈ కాలపు కుర్ర టీచర్లను కథలు చెప్పమంటే పిల్లల పత్రికల్ని తిరగేస్తున్నారు. కామిక్స్‌ను , వాస్తగాథల్ని, చివరికి పెద్ద పెద్ద జోక్స్‌ను సైతం పిల్లలకి కథలుగా చెప్పడానికి పూనుకొంటున్నారు. ఇవన్నీ కథల జాబితాలోనే వస్తాయా? వస్తే రావచ్చు. కానీ మన ఆరేడేళ్ళ పిల్లల్ని ఇవి మన పాతకథలంత ప్రభావితం చేస్తాయా? అనేది మాత్రం అనుమానాస్పదం.
మన సాంప్రదాయక కథలకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న కథల్లో కన్పించడం లేదు. మంచి కథకుండే లక్షణాలేమిటి? వీటిని తర్వాత పరిశీలిద్దాం. దీనికి ముందు ఇలాంటి మంచి కథలెక్కడ దొరుకుతాయో చూద్దాం
పంచతంత్రం, జాతక కథలు, మహాభారతం, అరేబియన్ నైట్స్, విక్రమాదిత్య కథలు, వివిధ ప్రాంతాల జానపద కథలు మనకు ఎన్ని మంచి కథల్నయినా అందిస్తాయి. ఇదొక పెద్ద భాండాగారం. కొంచెం కష్టపడ గల్గితే కథా సరిత్సాగరం, గులిస్తాన్, బోస్టన్, బీర్బల్, తెనాలి రామలింగడు, జానపదాలు లాంటివి కావల్సినన్ని దొరుకుతాయి. ఒక్క మన దేశానికే గాదు ప్రపంచమంతా మంచి కథలు కోకొల్లలు. 'ఇంత పరిశోధన మాకెక్కడ సాధ్యం' అని మీరనవచ్చు. మిత్రులారా! కథలు చెప్పాలనే అనుకొంటే మంచి కథల్ని ఎన్నుకోవడం, వెతుక్కోవడం చాలా చిన్నపని అని నా అభిప్రాయం.
మంచి కథ ఎలా ఉంటుంది?
ఏది మంచికథ అని నన్నెవరైనా ప్రశ్నిస్తే పిల్లలు తరతరాల నుంచి దేన్ని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారో అదే మంచికథ అని నేను జవాబిస్తాను. ఇక్కడ న్యాయ నిర్ణేతలు పిల్లలేతప్ప మనం కాదని నా దృఢ విశ్వాసం. మన పంచతంత్రంలోని 'సింహం కుందేలు' కథనే తీసుకోండి. దీన్ని మనం చాలా సీదాసాదా కథగా భావిస్తాం. కానీ లోతులోకి వెళితే ఇందులోని మంచి కథ లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. ఈ కథలోని మలుపుల్ని ఇప్పుడు కొంచెం పరిశీలిద్దాం.
మన బుజ్జి కుందేలు సింహానికి కవళంగా వెళ్ళాల్సిన దుర్దినం వచ్చింది. తీరిగ్గా కుందేలు సింహం గుహ దగ్గర కెళ్లేప్పటికి ఆకలితో సింహం నకనకలాడి పోతోంది. మిన్నూ మన్నూ తెలిసే స్థితిలో లేదది. ఇప్పుడు మనం కుందేలు తన అబద్దాల పురాణాన్ని ప్రారంభించాలి. సింహంతో కనీసం మాట్లాడ్డానికయినా తగిన సందర్భమేనా ఇది? ఏమాత్రం కాదని కథ వినే వాళ్ళందరికీ తెలుసు. అయినా కుందేలు తానెందుకు ఆలస్యంగా రావల్సి వచ్చిందో, దారిలో తనని మరో సింహం ఎలా అడ్డగించిందో ప్రాణాలకు తెగించి చెప్పింది. ఆకలి కంటె కోపం తీవ్రమైందని కుందేలుకు తెలుసు. సరిగ్గా ఆ పాయింటునే అది పట్టుకొంది. పెత్తందార్లకు అహంకారం ఎక్కువ. అది ఏ మాత్రం దెబ్బతిన్నా వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకే సింహం ఆకల్ని అవతలబెట్టి శత్రువు సంగతి తేల్చుకోవాలని కుందేలు వెంట నడిచింది. గుడ్డి భావి దగ్గరికి చేరింది.
మళ్ళీ ఇది కుందేలుకు కష్టకాలం (కథలో ఇదో మలుపు). ఇక్కడ కూడా కుందేలు తెలివిగా సింహం తెలివితక్కువ ఆవేశం మీదా, అసూయ మీదా ఆధారపడింది. సింహం బావిలోకి చూచి తన బింబాన్ని శత్రు సింహం అనుకొని దూకి దిక్కులేని చావు చచ్చింది.
ఇన్నాళ్ళూ ఇంత ప్రచారం పొందిన ఈ కథను ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ కథా వస్తువేమీ సామాన్యమైంది కాదు. దుర్మార్గమైన అధికార పిశాచం ముందు ప్రాణాలతో బయటపడ్డం దాదాపు అసాధ్యమైన వేళ కుందేలు లాంటి బడుగు ప్రాణి పాపం ఏం చెయ్యాలి? అనేది ఇక్కడున్న సమస్య. నిజానికిది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంత పెద్ద విషయాల్ని మనం పిల్లలకు దూరంగా ఉంచాలనుకొంటాం. విచిత్ర మేమంటే పిల్లలు ఇంత పెద్ద విషయాన్నే ఇష్టపడతారు! ఎందుకిష్టపడతారు? దాన్ని తర్వాత పరిశీలిద్దాం.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 76