Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్ల ఈమెయిల్ భాష మరింత పదునెక్కుతున్న లిఖిత రూపం.

ఇలా ఎలక్ట్రానిక్ యుగం భాషకు కొత్త ప్రపంచాన్ని తెరిచింది. కొత్త అవసరాల్ని తెచ్చింది. దానికి తగ్గట్టు భాష కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధమైంది.

ఇదీ ఈ సందర్భంగా క్రిస్టల్ చేసే విశ్లేషణ.

అందుకే ఆయన ఈ ఇంటర్నెట్ భాషపై అధ్యయనం ప్రారంభించాడు. ఈ భాష వల్ల సాంప్రదాయకాంశాలు ఏమీ తగ్గిపోతున్నాయి? కొత్తవి ఏవి వస్తున్నాయి? రాయడం అనేది తగ్గిపోతోంది గదా. పొట్టి పొట్టి వాక్యాలతో ఒకానొక informal పద్ధతిలోకి భాష రూపాంతరం చెందుతోంది గదా! అనేవి ఆయన పరిశీలిస్తున్నాడు.

ఆయన మరో ఆసక్తికరాంశం కూడా చెపుతున్నారు. అదేమంటే క్రమంగా ఇంటర్నెట్ బహు భాషామయం అవుతోంది. వెబ్‌సైట్లే గాదు ఇ-మెయిల్స్, చాటింగ్ కూడా ఈ స్వభావం సంతరించుకొంటున్నాయి. ఇంటర్నెట్ మొదలైనపుడు ఇంగ్లీషు తప్ప మరొకటి లేదు. ఇప్పుడు! అంతా తారుమారవుతోంది. మొదటిసారిగా ఇంటర్నెట్‌లో ఇంగ్లీషు సగానికి సగం కంటే తక్కువకు పడిపోయింది.

ఇంకా చైనా భాష వెబ్‌లోకి అంతగా ఎక్కలేదు. ఎక్కితే అప్పుడు ఇంగ్లీషు ఏమవుతుందో మరిక చెప్పనక్కర లేదు.

మరి మన భాషలు భద్రం మనం మన వారసత్వం భద్రం అని గుండెల మీద చెయ్యి వేసుకొని ఉండొచ్చుగా అంటే క్రిస్టల్ దీనికొప్పుకోడు.

సెప్టెంబరు 16ను ప్రపంచ భాషా దినంగా యునెస్కో ప్రకటించింది. మాతృభాషా దినాలు కూడా ఉన్నాయి. ఇవి ఎంతమందికి తెలుసు. ఎవరు పాటిస్తున్నారు వీటిని?

జంతువులు అంతరిస్తున్నాయని ఆవేదన చెందుతాం. పక్షులు అదృశ్యమవుతున్నాయని ఆందోళనలు చేస్తాం. మరి భాషల సంగతి ఏమిటి?

భాషలు, భాషల వైవిధ్యం, భాషల కొస్తున్న ప్రమాదం, భాషల్లో వస్తున్న మార్పులు ఇవన్నీ, మన కళాకారులకి, మేధావులకి ఏ మాత్రం పట్టడం లేదు.

'ఒక భాష అంతరించడం ఇతివృత్తంగా ఒక మంచి నవల రాసినట్టు, ఒక సినిమా తీసినట్టు, ఒక నాటకం రాసినట్టు, ఒక మంచి చిత్రకారుడు స్పందించినట్టు నాకైతే ఎక్కడా కన్పించలేదు.

'అంతరించడం అలా ఉంచండి. అందమైన బహుభాషా ప్రపంచం గురించి కలలు కనే స్వాప్నికులెంతమంది? ఆ స్వాప్నికతను మంచి కళారూపాలుగా ఆవిష్కరించే కళాకరులెంత మంది? అసలు శాస్త్రవేత్తలకున్న ఈ స్తానం ఏమిటి? కళాకారులకున్న గౌరవం వీరికుందా?'

'నేను 1990లో World of language ప్రాజెక్టు రూపొందించాను. బ్రిటిష్ కౌన్సిల్ సాయం కోరాను. ప్రపంచంలో మొట్టమొదటి 'భాషా మ్యూజియం' నెలకొల్పడం నా కల. ప్రపంచ భాషలన్నిటి సుసంపన్నత అందులో ప్రతిబింమించాలని ఆశపడ్డాను. దీనికి ప్రభుత్వం ముందుకు రాలేదు.

నాకింకా చాలా కోర్కెలున్నాయి. 'భాషల నగరం', (City of Language), భాషా సభ. (House of Language) నెలకొల్పాలన్నవి వీటిలో కొన్ని. యూరోపియన్ మోడరన్ లాంగ్వేజెస్ అసోసియేషన్ వారు కొంచెం ముందుకొచ్చారు. కానీ అదీ అంతంత మాత్రంగానే ఉంది.

ఇదీ భాషల పట్ల మనం చూపుతున్న ప్రేమ.

ఇంకో మాట కూడా చెప్పాలి. ఇంగ్లీషును చూసి మనం భయపడుతున్నాం. దాని జోలికి పోవాలంటే మనం జంకుతున్నాం. అంత గొప్ప భాష ముందు అల్పుణ్ణి నేనెంత? అనుకొంటున్నాం. మనం స్వంతంగా ఇంగ్లీషు పదాలు సృష్టించాలి. తెలిసిన పదాల్ని మార్చాలి. మన ఇష్టం వచ్చినట్లు ప్రయోగించాలి. ఈ విషయంలో షేక్‌స్పియర్ మనకు మార్గదర్శి. ఆయన ఎక్కడెక్కడివో వేల పదాలు తెచ్చి ఇంగ్లీషులోకి ఎక్కించేశాడు. క్రియల్ని నామవాచకాలు చేశాడు. నామవాచకాల్ని క్రియలుగా మార్చాడు. ఆయన ఇలా తెచ్చి పెట్టిన పదాల్లో సుమారు 800 పదాలు ఇంగ్లీషులో నిలబడిపొయ్యాయి. మిగతావి ఆయన గ్రంథాలకే పరిమితమైపోయాయి. భాషను స్వంతం చేసుకోడమంటే ఇదన్నమాట!

మూలం: ప్రొ॥ డేవిడ్ క్రిస్టల్‌

అనుసృజన: వి.బాలసుబ్రహ్మణ్యం

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 74